మేం తెచ్చిన ఈవీ పాలసీతోనే రాష్ట్రంలో బీవైడీ ప్లాంట్​ : కేటీఆర్

 మేం తెచ్చిన ఈవీ పాలసీతోనే  రాష్ట్రంలో బీవైడీ ప్లాంట్​ : కేటీఆర్
  • ఫార్ములా ఈ రేస్​ కూడా అందుకు కారణం: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ హయాంలో రూపొందించిన ఎలక్ట్రిక్​ వాహనాల పాలసీ ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రంలో బీవైడీ సంస్థ కార్ల తయారీ ప్లాంట్​ను ఏర్పాటు చేయబోతున్నదని ఆ పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ అన్నారు. వెయ్యి కోట్ల డాలర్లతో పెట్టుబడులు పెట్టేందుకు 2022–23లోనే తమ ప్రభుత్వం చర్చలు జరిపిందని శుక్రవారం ఎక్స్​లో ఆయన పేర్కొన్నారు. ఒలెక్ట్రా సంస్థతో కలిసి పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ నిర్ణయించినా.. నాడు కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించడంతో ముందుకు పడలేదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులను సరళీకరించడంతో బీవైడీ ప్లాంట్​ ఏర్పాటుకు లైన్​ క్లియర్​అయిందన్నారు. బీవైడీ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ ప్లాంట్​ను ఏర్పాటు చేస్తున్నదంటే.. నాడు తమ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ కార్​ రేసు కూడా కారణమన్నారు. 

దానిని కేవలం ఓ రేసుగానే చూడొద్దన్నారు. ‘‘తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రోగ్రామ్​లో భాగంగా ఫార్ములా ఈ రేస్​ను నిర్వహించాం. దేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తెలంగాణను హబ్​గా మార్చాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళిక ప్రకారం పనిచేశాం. అందులో భాగంగానే వినూత్నమైన ఈవీ పాలసీ, ఈవీ సమిట్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు, ఫార్ములా ఈ నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాం. అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వ ఆలోచనలు, విధానాల వల్లే బీవైడీ పెట్టుబడి వచ్చింది. ప్రభుత్వాలు మంచి విధానాలను ప్రవేశపెడితే, నీచమైన రాజకీయాలను అధిగమించి గొప్ప ఫలితాలు వస్తాయని బీవైడీ పెట్టుబడితో రుజువైంది’’ అని పేర్కొన్నారు.