కామారెడ్డిలో భూములు గుంజుకోవడానికి కేసీఆర్ రావడం లేదు: కేటీఆర్

కేసీఆర్.. కామారెడ్డికి ఎందుకు పోతుండు.. ఏ కారణంతో కామారెడ్డిని ఎంచుకున్నాడు అని చాలా ఆసక్తిగా రాష్ట్ర ప్రజలంతా కామారెడ్డి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, అక్టోబర్ 31వ తేదీ మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ పల్లొని మాట్లాడారు.

కొందరు ప్రతిపక్ష నేతలు కేసీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో భూములు గుంజుకోవడానికి కేసీఆర్ రావడం లేదన్నారు.  రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ఎక్కడి నుంచైనా గెలువగలిగే నాయకుడు కేసీఆర్ అని.. కాని, కేసీఆర్ ఇక్కడికి రావడానికి కారణం  ఎమ్మెల్యే గంప గోవర్ధన్  అని చెప్పారు.  కేసీఆర్ ను కామారెడ్డిలో పోటీ చేయాలని స్వయంగా ఎమ్మెల్యేనే  కోరారని తెలిపారు. 

కేసీఆర్ నియోజకవర్గం అని ఒక్కసారి ముద్రపడితే వేగంగా అభివృద్ధి చెందుతుందని.. నియోజకవర్గంలోని ప్రతి పల్లె రూపురేఖలు మారుతాయని.. అంతకంటే తనకు ఏం కావాలని పట్టుదలతో కేసీఆర్ ను కామారెడ్డి నుంచి పోటీ చేయమని కోరినట్లు చెప్పారు.
 

కామారెడ్డిలో  కేసీఆర్ పై ఉద్యమ ద్రోహీ రేవంత్ రెడ్డి పోటీ చేస్తారట.. కామారెడ్డి సత్తా ఏంటో.. దెబ్బ ఏందో  రేవంత్ రెడ్డికి చూపించాలన్నారు. తెగ బలిసిన కోడి..చికెన్ షాప్ ముందుకొచ్చి  తొడకొట్టి రా అన్నట్లు.. రేవంత్ రెడ్డి, కేసీఆర్ పై పోటీ చేస్తడట అని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ఇక్కడి రైతులు తనను కలిశారని.. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ మాత్రమే ఉంటుందని.. కొత్త ప్లాన్ ను రద్దు చేసినట్లు చెప్పానన్నారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తే.. చుట్టు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. నవంబర్ 9న కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేస్తారని తెలిపారు. కేసీఆర్ ను గెలిపిస్తే.. రాష్ట్రంలోనే నంబర్ వన్  నియోజకవర్గంగా కామారెడ్డి నిలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.