- బీఆర్‌ఎస్ కార్మిక విభాగం నేతలతో కేటీఆర్
- ప్రతి జిల్లాలోనూ గట్టి కమిటీలను ఎన్నుకోండ
- కేసులు పెట్టినా భయపడొద్దు..
- కేసీఆర్ రూ.4 లక్షల కోట్లు అప్పు చేసినా అన్ని పథకాలిచ్చిండు
- రేవంత్ ఏడాదిలోనే రూ.1.40 లక్షల కోట్లు అప్పు చేసి ఏమిచ్చిండని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వచ్చే నాలుగేండ్లు చుక్కలు చూపించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ బాధ్యతను పార్టీ కార్మిక విభాగం తీసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించేందుకు 33 జిల్లాలకూ కొత్త కమిటీలు ఎన్నుకోవాలన్నారు. కేసులకు భయపడొద్దని, పార్టీ నాయకత్వం, లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ కార్మిక విభాగం డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. అధికారం పోయినా పోరాట పటిమ పోలేదని చాటి చెప్పేలా బీఆర్‌ఎస్ కార్మిక విభాగం.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్నదన్నారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశాడన్న కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్మిక విభాగం నేతలకు కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ నాయకులు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘2014లో కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రాన్ని అప్పజెప్పినప్పుడు మన రాష్ట్రానికి ఉన్న అప్పు రూ.72 వేల కోట్లు. అప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.14 లక్షలు. రెవెన్యూ మిగులు రూ.369 కోట్లుగా ఉండేది. బీఆర్‌ఎస్ అధికారం నుంచి దిగిపోయే నాటికి తలసరి ఆదాయం రూ.3.56 లక్షలు. రెవెన్యూ మిగులు రూ.5,944 కోట్లుగా ఉంది. మిగులు రాష్ట్రంగా.. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌తో కాంగ్రెస్ వాళ్లకు రాష్ట్రాన్ని అప్పగించాం’’అని పేర్కొన్నారు.
పాత బకాయిలు కట్టుకుంటనే అన్నీ చేసినం..
2014 నుంచి 2023 వరకు పాత బకాయిలు కట్టుకుంటూ.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. కేసీఆర్ చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు అని కేటీఆర్ అన్నారు. అంటే ఏటా చేసిన అప్పు రూ.40 వేల కోట్లు అన్నారు. ఇది అప్పు కాదు పెట్టుబడి అని చెప్పారు. ‘‘అప్పుచేసి నల్గొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని కట్టాం. దాన్ని అప్పు అంటారా? పెట్టుబడి అంటారా? అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన ఒక్కొక్క దాన్ని కేసీఆర్ నిర్మించారు.
కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్టు, యాదాద్రి టెంపుల్, 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు, 2,600 రైతు వేదికలు ఇలా.. ఏదైనా రాష్ట్రం కోసమే కేసీఆర్ పెట్టిన పెట్టుబడి. 50 ఏండ్లు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి మొత్తం తెలుసని టీవీ చర్చల్లో భట్టి విక్రమార్క చెప్పారు. సంపద సృష్టించడం తెలుసని కాంగ్రెస్ నాయకులు గప్పాలు కొట్టారు. వంద రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. 8 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. పెన్షన్లు రావడం లేదు. ఐదు డీఏలు ఉంటే ఒకటే ఇచ్చిండు. పీఆర్సీ దిక్కు చూడలేదు. జీతాలు ఇచ్చుడే ఎక్కువ అని మాట్లాడుతున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.
అప్పు చేసినా హామీలు నెరవేర్చలే..
ఏడాదికి 40 వేల కోట్ల అప్పుచేసి కేసీఆర్ ఎన్నో పథకాలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. ‘‘ఒక్క ఏడాదిలోనే 1.40 లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి.. ఎక్కడైనా ఒక కొత్త ఇటికె అన్న పెట్టాడా? కొత్త పైప్ లైన్ వేశాడా? కొత్త కాలువ తవ్విండా? ఒక కార్మికుడికైనా లాభం చేసిండా? ఆడబిడ్డలకు రూ.2,500 ఇచ్చిండా? ఆడబిడ్డల లగ్గానికి తులం బంగారం ఇచ్చిండా? చదువుకున్న పిల్లలకు స్కూటీ ఇచ్చిండా? అవేవీ ఇవ్వకుండానే రేవంత్ అంత అప్పు ఎందుకు చేసిండో ప్రజలు నిలదీయాలి. ప్రజలకు ఒక్క మేలు కూడా చేయని రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాత్రం మూటల్ని మోసే పనిని నిజాయతీగా చేసిండు. తన పదవి కాపాడుకోవడం కోసం వేల కోట్ల రూపాయలను ఢిల్లీకి తరలించుకుపోయిండు" అని ఆరోపించారు.