- ఘనంగా సాగిన అలంకారోత్సవం
- ఆత్మకూర్ ఎస్బీఐ నుంచి క్షేత్రం వరకు సాగిన ఊరేగింపు
చిన్నచింతకుంట, వెలుగు : కురుమూర్తి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం స్వామి వారి అలంకారోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆభరణాలను కురుమూర్తి రాయుడికి అలంకరించడంతో కాంచన గుహ బంగారు కాంతులీనింది. ఉదయం ముక్కెర వంశస్తులు స్వామి వారికి మణులు, మాణిక్యాలు, వైడుర్యాలు, పచ్చలు తొడిగిన బంగారు ఆభరణాలను వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఎస్బీఐ బ్యాంకు నుంచి బయటకు తీశారు. అక్కడ బ్యాంకు ఆవరణలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆభరణాల పెట్టెను భారీ జనసందోహం మధ్య ఊరేగించారు.
ఊరేగింపు ఎస్బీఐ బ్యాంకు నుంచి మదనాపురం మండలంలోని కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలోని ఆత్మకూర్ సంస్థానాధీశుడైన రాజా శ్రీరామ్ భూపాల్ గృహానికి చేరుకుంది. అక్కడ వేద పండితులతో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్బంగా సంస్థానాధీశుడితో పాటు దేవరకద్ర, మక్తల్ ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణా సుధాకర్ రెడ్డి ఆభరణాలను దర్శించుకున్నారు.
అనంతరం డప్పు వాయిద్యాల మధ్య అభరణాల పెట్టెను సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కురుమూర్తి క్షేత్రానికి చేర్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులకు ఆలయ చైర్మన్ గోవర్దన్ రెడ్డి, ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి ఆభరణాల పెట్టెను అప్పగించారు. సాయంత్రం ఆరు గంటలకు ఆభరణాలను మూల విరాట్‌కు అలంకరించారు. రాత్రి ఎనిమిదిన్నర తర్వాత భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. ఊరేగింపు సందర్భంగా వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
మదనాపురం వెలుగు: కురుమూర్తి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమంలో దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి స్వర్ణకారుడు గాడిల వంశీయులు లక్ష్మీనారాయణ ఆభరణాలు ఎత్తుకున్నారుడీఎస్పీ సీఐ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య ఆభరణాల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వెంకట నారాయణ నాగన్న యాదవ్ రాజు వర్ధన్ రెడ్డి వడ్డే కృష్ణ హనుమాన్ రావు వడ్డే రాములు మని వర్ధన్ రెడ్డి శేఖర్ నాగరాజు తదితరులుపాల్గొన్నారు.