మన దేశంలో ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా కేజీ ఏకంగా100 రూపాయలు దాటింది. కారణం ఏదైనా మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కూరగాయల ధరలు ఇలానే భారీగా పెరిగాయి. ధరల మంట మన దేశానికే పరిమితం కాలేదు. విదేశాల్లోని ఇండియన్ స్టోర్స్ లోనూ ధరలు భారీగా పెరిగాయి.
ఒక నెటిజన్ సోషల్ మీడియాలో యూకేలోని కూరగాయల ధరలపై పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అక్కడ కేజీ కాకరకాయల ధర 1000 రూపాయలుగా, కేజీ బెండకాయల ధర 700 రూపాయలు పలుకుతున్నాయి. ఆరు ఆల్ఫోన్సో మామిడికాయల ధర 2,400 రూపాయలుగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన చావి అగర్వాల్ ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఇండియన్ స్టోర్స్ లో ఉన్న ధరలు చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ఒక స్టోర్ లో సరకుల ధరలు చూపిస్తూ ఆమె ఇన్ స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.
లేస్ మసాలా ప్యాక్ భారత్ లో 20 రూపాయలు ఉంటే, లండన్ లో అది 95 రూపాయలుగా ఉంది. కూరగాయల ధరలను కూడా ఆమె చూపించారు. సాధారణంగా
ఇండియన్ కరెన్సీతో పోల్చితే లండన్ లో వాటి ధరలు ఎక్కువగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న ధరలు మాత్రం అసాధారణంగా ఉన్నాయని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.