
తెలంగాణలో అతి పెద్ద గిరిజన తెగ బంజారాలు. వీరు బ్రిటీష్ పరిపాలనా కాలంలో సరుకుల రవాణాను ప్రధాన వృత్తిగా చేపట్టారు. అనంతర కాలంలో స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఈ నివాసాలనే తండాలు అంటారు. తండా అనే పదాన్ని అక్బర్ మొదటగా ఉపయోగించినట్లు తెలుస్తున్నది. బెనరాస్కు సమీపంలో గుంపులుగా ఏర్పడిన బంజారా నివాసాలకు అక్బర్ తండా అని పేరు పెట్టాడనే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాధారణంగా బంజారాలు అటవీ ప్రాంతాల్లో మిగిలిన కులాల వారికి దూరంగా బంజరు భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు.
బంజారాలు తండా న్యాయవ్యవస్థకు, స్వరాజ్య పాలనకు కట్టుబడి ఉంటారు. తండా రాజకీయ వ్యవస్థలో నాయక్ (నాయకుడు), కారోబారీ (సలహాదారుడు, కార్యదర్శి), డప్టియా (సమాచారం, సందేశాలు చేరవేసేవాడు) మొదలైనవారు ఉంటారు. బంజారాలు నిర్వహించే పంచాయితీని నసాబ్ అంటారు. నసాబ్ అంటే సమస్య పరిష్కారానికి జరిపే సామూహిక పంచాయితీ అని అర్థం. ఈ నసాబ్కు తండా నాయక్ అధ్యక్షత వహించి కారోబారీ సలహా మేరకు కొనసాగిస్తారు. బంజారాలు అధికంగా తాము జరుపుకునే పండుగ సమయాల్లో మోబ్డార్లను (ఇప్ప పూల సారా), గోళేర్దార్ (బెల్లం సారా), సీంధీ (కల్లు)ను తాగుతారు.
సీత్లా భవాని పండుగ
లంబాడాల జీవనాధారం పశుసంపద. వీటి కోసం ప్రత్యేకంగా జరుపుకునే పండుగనే సీత్లా భవాని పండుగ అంటారు. బంజారాలు కొలిచే ఏడుగురు శక్తి దేవతాల్లో సీత్లా భవాని ఒకరు. పశువులకు, మేకలకు, గొర్రెలకు ఎలాంటి రోగాలు సోకకుండా, మనుషులకు కలరా, కుష్ఠు వ్యాధులు రాకుండా సీత్లా భవాని దేవత రక్షిస్తుందని ఈ పండుగ జరుపుకుంటారు. తండాల్లో పెద్ద మనిషి సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగను మంగళవారం లేదా గురువారం రోజు జరుపుకుంటారు. పండుగ రోజు తండాలోని ప్రతి ఇంట్లో జొన్న గుగ్గిల్లు, పెసర గుగ్గిల్లు, బొబ్బర్ల గుగ్గిల్లు వండి నైవేద్యంగా పెడతారు. అనంతరం లంబాడీ స్త్రీలందరూ కలసి గిన్నెలో వండినటువంటి గుగ్గిల్లు పెట్టుకొని సామూహికంగా, వలయాకారంలో నృత్యం చేస్తుంటారు.
తీజ్ పండుగ
సాధారణంగా తొలకరి జల్లులో కనిపించే ఆరుద్ర పురుగును బంజారాలు తీజ్ అంటారు. తీజ్ అంటే నారు అని అర్థం వస్తుంది. సీత్లా భవాని పూజ ముగిసిన తర్వాత పెళ్లి కాని ఆడపిల్లలు జరుపుకునే పండుగనే తీజ్. ఈ పండుగ బతుకమ్మ పండుగను పోలి ఉంటుంది. లంబాడీలు పూలకు బదులుగా గోధుమ, శెనగ మొలకలను పూజిస్తారు. లంబాడీ యువతులు ఎర్రమట్టి పోసి దాంట్లో మెత్తటి ఎరుపును చల్లుతారు. యువతులు, ఆడపడుచులు అందరూ కలసి సాయంకాలం సమయంలో పాటపాడుకుంటూ నృత్యం చేస్తూ గోధుమ, శెనగ మొలకలను బుట్టల్లో చల్లుతారు. తర్వాత తండాలోని స్త్రీలు అందరూ సామూహికంగా కలసి వలయాకారంలో నృత్యం చేస్తారు. ఈ పండుగ రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో తండాలో ఉన్న పెండ్లి కాని అమ్మాయిలు అందరూ కలసి ఇత్తడి బిందె నెత్తిపై ఎత్తుకొనిపోయి పాటపాడుకుంటూ నీళ్ల కోసం వెళ్తారు. అనంతరం నీళ్లతో నింపిన బిందెలను మోసుకుని వస్తారు. యువతులు తెచ్చిన నీళ్లను తీజ్ బుట్టలపై చల్లుతూ పాటలు పాడుతారు. తీజ్‌ను ఎనిమిది రోజులు పూజించి తొమ్మిదో రోజున అంగరంగ వైభవంగా తండాకు కిలోమీటరు దూరంలో ఉన్న కాల్వ లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు. అనంతరం ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఉంటే సోదరుడు వారి కాళ్ళు కడిగి బొట్టుపెట్టి కట్నకానుకలు సమర్పిస్తారు. తీజ్ పండుగ ఏడో రోజున డమోలి చేస్తారు. ఎనిమిదో రోజు ఘణ్గోర్ అనే మట్టి బొమ్మలను తయారు చేసి హాస్యభరితమైన పాటలతో ఆహ్లాదంగా జరుపుకుంటారు. యువతులు మాత్రం శాకాహార వంటలను ఈ తొమ్మిది రోజులు మితంగా తింటారు.