
- కడీలు పాతడానికి వచ్చిన ఓ వర్గం
- తమదేనంటూ అడ్డుకున్న మరో వర్గం
- ఇరువర్గాల ఫిర్యాదు.. కేసు నమోదు
మాదాపూర్, వెలుగు: హైటెక్‌సిటీ ఏరియాలో రూ. కోట్ల విలువ చేసే భూమి తమదంటూ కొందరు ఫెన్సింగ్వేయడానికి ప్రయత్నించగా, మరో వర్గం తమదే స్థలమంటూ అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో మాదాపూర్పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు. రెండు వర్గాలు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశామని మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ తెలిపారు. ఓం ప్రకాష్‌రెడ్డి, నర్సింగరావు అనే వ్యక్తులతో పాటు మరికొంత మంది ఖానామెట్సర్వే నెంబర్11/37/ఏ లో ఉన్న ఐదెకరాల స్థలం తమదేనంటూ మంగళవారం స్థలం చుట్టూ కడీలు వేస్తున్నారు.
మరోవైపు ఆ స్థలం తమదేనంటూ కొండలరావు అనే వ్యక్తి, ఇతడి అనుచరులు అడ్డుకున్నాడు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, పోలీసులు ఫెన్సింగ్పనులను నిలిపివేసి, వారిని అక్కడి నుంచి పంపించివేశారు. కొండల్రావు ఫిర్యాదు మేరకు ఓం ప్రకాష్‌రెడ్డితో పాటు మరికొందరిపైనా.. అలాగే కొండల్రావు తరఫున ఎమ్మెల్సీ నవీన్‌రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు.. సర్వే చేయాలని శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను కోరారు. సర్వే తర్వాత కేసు దర్యాప్తు చేపడుతామన్నారు.