
- 25 శాతం రాయితీ ఇచ్చినా..ఇంట్రెస్ట్ చూపని ప్లాట్ల ఓనర్లు
- మున్సిపాలిటీల్లో ఐదు శాతానికి మించలే
- మండలాల్లో మూడు శాతమే
యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్లోగా సాగుతోంది. రెగ్యులరైజేషన్ చేయించుకోవడానికి ప్లాట్ల ఓనర్లు ఆసక్తి చూపడం లేదు. గడువు దగ్గరికి వచ్చినా ఇప్పటివరకు మున్సిపాలిటీల్లో ఐదు శాతానికి మించి రెగ్యులరైజేషన్ కాలేదు. రెగ్యులరైజేషన్ కోసం అప్పట్లో అప్లికేషన్లు చేసుకున్న వారు.. 25 శాతం రాయితీ ఇచ్చినా ఇప్పుడు ఫీజు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. రెగ్యులరైజేషన్ చేయించుకుంటే తమకు ఇబ్బంది కలుగుతుందేమో అన్న అనుమానంతో కొందరు ముందుకు రావడం లేదు.
మరికొందరు ఫీజు విషయంలో వెనుకాడుతున్నారు. వంద గజాల ప్లాటును రెగ్యులరైజేషన్ చేయించుకోవాలంటే కనీసం రూ.10 వేలకు తక్కువ కావడం లేదు. మున్సిపాలిటీల్లో అయితే మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఎక్కువ మంది వెనక్కి తగ్గుతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోవడంతో అమ్మకాలు,కొనుగోళ్లు సరిగా జరగడం లేదు. బిజినెస్ పుంజుకుంటే కొన్నవాడే రిజిస్ట్రేషన్ సమయంలో ఫీజు చెల్లిస్తారులే అన్నట్టుగా రెగ్యులరైజేషన్ కోసం ముందుకు రావడం లేదని తెలుస్తోంది. గడువు సమీపిస్తున్నా మున్సిపాలిటీల్లో అప్రూవ్ అయిన ప్లాట్లలో ఐదు శాతం కంటే ఎక్కువగా రెగ్యులరైజేషన్ కాలేదు. మండలాల్లో మూడు శాతమే రెగ్యులరైజేషన్చేయించుకోవడానికి ఫీజు చెల్లించారు.
యాదాద్రిలో లక్ష ప్లాట్ల వెరిఫికేషన్..
అక్రమంగా చేసిన లే అవుట్లను క్రమబద్ధీకరించడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో అప్లికేషన్లను ఆహ్వానించింది. క్రమక్రమబద్ధీకరణకు భారీ స్పందన వచ్చింది. యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, హెచ్ఎండీఏ పరిధిలోని మండలాల నుంచి మొత్తంగా 2,12,971 అప్లికేషన్లు వచ్చాయి. మున్సిపాలిటీల పరిధిలో 55,627, పంచాయతీల్లో 62,293, హెచ్ఎండీఏ పరిధిలో 95,051 అప్లికేషన్లు వచ్చాయి. వీటిని వెరిఫికేషన్ చేయడానికి ఆఫీసర్లు ఇబ్బందులు పడ్డారు. కొందరు డాక్యుమెంట్లు, మరికొందరు ఈసీలు సరిగా అప్లోడ్ చేయలేదు. కొందరు తమ ప్లాట్ల హద్దులు సరిగా పేర్కొనలేదు. దీంతో లక్ష ప్లాట్లను వెరిఫికేషన్ చేయగలిగారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో 65,130 మంది ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు అప్లయ్ చేసుకోగా, వీటిలో 57,985 అప్లికేషన్లను అప్రూవ్ చేశారు. వీటిలో కేవలం 3,555 మంది రెగ్యులరైజేషన్ కోసం ఫీజు చెల్లించారు. వీటిలో 2,317 మందికి ప్రొసీడింగ్స్ అందించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 35,465 అప్లికేషన్లు రాగా, 1,845 మంది ఫీజు చెల్లించారు. రెగ్యులరైజ్ ద్వారా రూ.9.30 కోట్ల ఆదాయం సమకూరింది. కోదాడలో 16,177 అప్లికేషన్స్ రాగా, 1,200 మంది ఫీజు చెల్లించగా, రూ.6 కోట్ల ఆదాయం వచ్చింది. హుజూర్ నగర్లో 4,420 అప్లికేషన్స్ రాగా, 200 మంది ఫీజు చెల్లించగా, రూ.80 లక్షల ఆదాయం వచ్చింది. నేరేడుచర్లలో 6,022 అప్లికేషన్స్ రాగా, 82 మంది ఫీజు చెల్లించగా, రూ.24 లక్షల ఆదాయం వచ్చింది.
నల్గొండ జిల్లాలో..
నల్గొండ మున్సిపాలిటీలో 36,129 అప్లికేషన్లు వచ్చాయి. 27,907 అప్రూవ్చేయగా, 6,065 దరఖాస్తులు కోర్టు కేసులు, వివాదాస్పద, నిషేధిత ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో 1,427 మంది రెగ్యులరైజేషన్ కోసం ఫీజు చెల్లించారు. మిర్యాలగూడలో మొత్తం 13,155 అప్లికేషన్లు రాగా, 9,138 అప్లికేషన్లకు ఫీల్డ్ ఎంక్వైరీ చేశారు. 4,017 అప్లికేషన్లు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయి. 432 మంది రూ.3.24 కోట్లు చెల్లించారు. నకిరేకల్‌లో 7060 అప్లికేషన్లు రాగా,102 మంది రూ.20 లక్షలు చెల్లించారు. చండూరులో 2,927 అప్లికేషన్లకు 125 మంది రూ.18 లక్షలు చెల్లించారు.
ప్రభుత్వ భూమి, నాలా కింద ఉన్న, కోర్టు కేసులో ఉన్న 475 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. దేవరకొండలో 5,022 అప్లికేషన్లు రాగా, 3,422 అప్రూవ్ అయ్యాయి. 90 మంది రూ.17 లక్షలు చెల్లించారు. ఇందులో వివిధ కారణాల చేత 40 డాక్యుమెంట్లు రిజెక్ట్ అయ్యాయి. హాలియాలో 3,418 అప్లికేషన్లు రాగా, 170 మంది రూ.40 లక్షలు చెల్లించారు. చిట్యాలలో 2,500 అప్లికేషన్లు రాగా 100 అప్లికేషన్లకు పేమెంట్ చేశారు.
మున్సిపాలిటీల్లో ఐదు.. గ్రామాల్లో మూడు శాతమే..
యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కలిపి వెరిఫికేషన్ అనంతరం 52,696 ప్లాట్లు అప్రూవ్అయ్యాయి. వీటిలో కేవలం 3,256 ప్లాట్లు (ఐదు శాతం) యజమానులు మాత్రమే ఫీజు చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకున్నారు. ఆలేరు మున్సిపాలిటీలో 251, భువనగిరిలో 622, చౌటుప్పల్‌లో 1071, మోత్కూరులో 236, పోచంపల్లిలో 492, యాదగిరిగుట్టలో 584 మంది ప్లాట్ల ఓనర్లు ఫీజు చెల్లించి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారు.
జిల్లాలోని 17 మండలాల్లో వెరిఫికేషన్అనంతరం 51,380 ప్లాట్లు అప్రూవ్ అయ్యాయి. వీటిలో 1863 ప్లాట్ల ఓనర్లు మాత్రమే ఫీజు చెల్లించి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారు. ఇందులోనూ ఒక్క యాదగిరిగుట్ట మండలంలోనే 879 ప్లాట్లు రెగ్యులరైజేషన్ జరిగింది. ఇంకా 49,517 ప్లాట్లు పెండింగ్‌లో ఉన్నాయి.