- సర్వే నెంబర్ల వారీగా మార్కింగ్
- కుమార్ పల్లి శివారు సర్వే నెం.229కు నాలుగు వైపులా బౌండరీస్ ఏర్పాటు
- ఏఆర్ అశోక్ బాబుతోపాటు మరికొందరి ఇండ్లు అందులోనే ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ
- ఇప్పటికే 15 మంది కోర్టుకు వెళ్లినట్టు సమాచారం
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ భూముల సర్వేతో ఆక్రమణల భాగోతం బయటపడుతోంది. వర్సిటీలో రెండు రోజులుగా విజిలెన్స్ ఆఫీసర్లు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి జాయింట్ ఇన్ స్పెక్షన్ నిర్వహిస్తుండగా, బుధవారం సర్వే నెంబర్ల వారీగా డీమార్కేషన్ చేపట్టారు. ప్రధానంగా కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్ బాబు వర్సిటీ భూమిలోనే ఇల్లు కట్టుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ముందుగా ఆ సర్వే నెంబర్ కు హద్దులు నిర్ణయించారు.
విజిలెన్స్ సీఐలు రాకేశ్, అనిల్, కేయూ డెవలప్ మెంట్ ఆఫీసర్ వాసుదేవారెడ్డి, హనుమకొండ సర్వేయర్ రాజేశ్, మున్సిపల్ బిల్డింగ్ ఇన్ స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో కుమార్ పల్లి శివారు 229 సర్వే నెంబర్ లో సర్వే చేసి హద్దులకు మార్కింగ్ చేశారు. అనంతరం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి హద్దులను పరిశీలించి, ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వర్సిటీ భూమిలోనే ఇండ్లు, రోడ్డు..
కుమార్ పల్లి శివారు 229 సర్వే నెంబర్ లో మొత్తంగా 6 ఎకరాల 15 గుంటల భూమి ఉండాల్సినప్పటికీ చాలా వరకు కబ్జాకు గురైనట్లు ఆరోపణలున్నాయి. దీంతో మొత్తం ఆ ల్యాండ్ డీమార్కేషన్ నిర్వహించారు. ఆ ల్యాండ్ కు తూర్పున సర్వే నెంబర్లు 234, 235, 236, పడమర 228, ఉత్తరం 230, దక్షిణం 217 సర్వే నెంబర్లలో భూములను గుర్తించి, 229 సర్వే నెంబర్ భూమి హద్దులు నిర్ణయించారు.
దాని ప్రకారం గుండ్ల సింగారం బీసీ కాలనీ వైపున్న సీసీ రోడ్డు దాదాపు 90 శాతం వర్సిటీ భూమిలోనే ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక సర్వే నెంబర్ 229 భూమిలో కేయూ ఏఆర్ అశోక్ బాబు ఇల్లు సహా అదే లైన్ లో మొత్తంగా 11 ఇండ్లు, దాదాపు ఆరు ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు స్థానికుల సమక్షంలో సర్వేయర్ పంచనామా నిర్వహించారు. ఇదిలాఉంటే కుమార్ పల్లి శివారు 214 లో కూడా పెద్దఎత్తున ఆక్రమణలు జరిగి సపరేట్ గా ఒక కాలనీయే వెలసిందనే ఆరోపణలున్నాయి. దీంతో తొందర్లోనే అక్కడ కూడా ఫిజికల్ సర్వే నిర్వహించి, ఆక్రమణల అంతు చూస్తామని అధికారులు చెబుతున్నారు.
15 మంది కోర్టుకు..
విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తోపాటు రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కాకతీయ యూనివర్సిటీ భూములకు హద్దులు నిర్ణయిస్తుండగా, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 76 మందికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు నోటీసులు జారీ చేయగా, నోటీసులు అందుకున్న వారితోపాటు కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటూ నోటీసులు తీసుకుని కొందరు అధికారులు కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది.
సుమారు 15 మంది కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. గతంలో కూడా కొంతమంది కోర్టుకు వెళ్లి వర్సిటీ భూములను చేజిక్కించుకోగా, ఇప్పుడు అలాంటి అవకాశం ఇవ్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని వివిధ విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. హైడ్రా తరహా వ్యవస్థ తీసుకొచ్చి వర్సిటీ భూముల్లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సర్వే తర్వాత నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు చెబుతున్నారు.