Rohit Sharma: గిల్, కోహ్లీ వెనక్కి.. వన్డే ర్యాంకింగ్స్‌లో హిట్ మ్యాన్ దూకుడు

శ్రీలంకతో వన్డే సిరీస్ లో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న గిల్ ను వెనక్కి నెట్టి హిట్ మ్యాన్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 763 రేటింగ్ పాయింట్స్ ఉంటే.. రోహిత్ శర్మ ఖాతాలో 765 పాయింట్స్ ఉన్నాయి. శ్రీలంకతో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ 3 మ్యాచ్ ల్లో 157 పరుగులు చేసి టాప్ స్కోరర గా నిలిచాడు.

తొలి రెండు మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీలు చేసిన హిట్ మ్యాన్ తన ర్యాంక్ ను మెరుగుపర్చుకున్నాడు. దీంతో నాలుగో స్థానంలో ఉండాల్సిన రోహిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ సిరీస్ కు ముందు నాలుగో స్థానంలో ఉన్న రోహిత్ తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ, గిల్ లను వెనక్కి నెట్టాడు. రోహిత్ రెండో స్థానానికి చేరుకోవడంతో రెండో స్థానంలో ఉండాల్సిన గిల్ మూడో ర్యాంక్ కు.. మూడో స్థానంలో ఉండాల్సిన కోహ్లీ నాలుగో స్థానానికి పడిపోయాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. టాప్ 4 లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉండడం విశేషం. ఈ సంవత్సరం భారత్ కు వన్డే మ్యాచ్ లు లేవు. సెప్టెంబర్ నుంచి టెస్టులు, టీ20 మ్యాచ్ లతో బిజీ కానుంది. అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగకపోయినా వార్నర్ 7 ర్యాంక్ లో నిలిచాడు. భారత్ తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించిన నిస్సంక 8వ స్థానంలో నిలిచాడు. 

బౌలింగ్ విషయానికి వస్తే భారత ఆటగాళ్లలో ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్ 10 లో చోటు సంపాదించారు. కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. బుమ్రా 8 వ స్థానంలో నిలిచారు. మహమ్మద్ సిరాజ్ 5 స్థానాలను కోల్పోయి 10 వ ర్యాంక్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ టాప్ లో ఉన్నాడు. టీం ర్యాంకింగ్స్ లో టీమిండియా అగ్ర స్థానంలోనే కొనసాగుతుంది.