
యాదాద్రి, వెలుగు : హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్‌ను దారుణంగా హత్య చేసిన సంఘటనపై నిరసన తెలుపుతూ మంగళవారం యాదాద్రి జిల్లాలోని భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరి గుట్ట లాయర్లు విధులను బహిష్కరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ పిలుపు మేరకు లాయర్లు ఇజ్రాయిల్ మృతికి సంతాపం ప్రకటించారు. లాయర్లపై దాడులు పెరిగాయని, హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లాయర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
కోదాడ, వెలుగు : రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఆర్ కే మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు నిరసనగా కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు.
హుజూర్ నగర్, వెలుగు : హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను ఖండిస్తూ హుజూర్ నగర్ కోర్టులో అడ్వకేట్లు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ తీర్మాన కాపీలను సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాంకుమార్ కు అందజేశారు. అంతకుముందు కోర్టు భవనంలో జరిగిన బార్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో సాముల రామిరెడ్డిని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.