
మంచిర్యాల, వెలుగు: లక్సెట్టిపేటలో నిర్వహించిన మహాజన్సంపర్క్ అభియాన్ బహిరంగ సభ బీజేపీ నియోజకవర్గ, జిల్లా శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభకు వచ్చిన నేతలకు బీజేపీ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగం ఉద్వేగ భరితంగా సాగడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నిండిపోయింది. ముఖ్యమంత్రిపై వేసిన సెటైర్లు నవ్వులు పుట్టించాయి.
బండి సంజయ్ కి ఘన స్వాగతం.....
లక్సెట్టిపేటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అధ్యక్షుడి కాన్వాయ్ గూడెం గుట్టకు చేరుకోగానే కార్యకర్తలు స్వాగతం పలికి పట్టణం వరకు ర్యాలీ నిర్వహించారు. ఊట్కూర్ చౌరస్తా వద్ద బండి సంజయ్ కి గజమాలవేసి ఘన స్వాగతం పలికారు. సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ సభ ప్రాంగణంకి చేరుకున్నారు. కార్యక్రమాల్లో బీజేపీ రాష్ర్ట కార్యదర్శులు ముల్కల్ల మల్లార్డెడి, పొనుగోటి రంగారావు, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, అగల్‌డ్యూటీ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్, రజినీష్జైన్తదితరులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో మంచిర్యాల వెనుకంజ:బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు
లక్సెట్టిపేట, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో మంచిర్యాల జిల్లా, నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడ్డదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం లక్సెట్టిపేట లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట కంటే మంచిర్యాల జిల్లా ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కడెం ప్రాజెక్టు నీళ్లు రాకపోగా గూడెం లిఫ్ట్ సరిగా పనిచేయకపోవడంతో నియోజకవర్గంలో 20 వేల ఎకరాలు పంటలు ఎండిపోయాయని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ క్వింటాల్‌కు అయిదు కేజీల చొప్పున తరుగు తీసినా ఎమ్మెల్యే కానీ, ఇతర పార్టీలు కానీ నోరు మెదపలేదని, బీజేపీ మాత్రమే రైతుల కోసం తెగించి కొట్లాడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు రైతుల కోసం ఎప్పుడైనా కొనుగోలు కేంద్రాలకి వచ్చారా అని ప్రశ్నించారు. రైతులకు నష్టం జరిగినా ప్రజలకు కష్టాలు వచ్చినా గిరిజన మహిళలపై దాడి జరిగినా ఎవరూ సరిగా స్పందించలేదన్నారు. బీజేపీ మాత్రమే ముందుండి పోరాడుతోందని అన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, అమృత్‌భారత్ స్టేషన్పథకంలో మంచిర్యాల రైల్వే స్టేషన్‌కు రూ.30 కోట్లు నరేంద్ర మోదీ ప్రభుత్వం చలవే అన్నారు. సీఎం కేసీఆర్ 2018లో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, 10 వేల క్వార్టర్లు నిర్మంచలేదని విమర్శించారు.
బీజేపీ పార్టీ ఆఫీసును ప్రారంభించిన బండి సంజయ్
కోల్ బెల్ట్,వెలుగు: మంచిర్యాల పట్టణంలోని కోర్టు సమీపంలో బీజేపీ జిల్లా పార్టీ ఆఫీసును పార్టీ చీప్ బండి సంజయ్, మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి బుధవారం రాత్రి ప్రారంభించారు . ఈ సందర్భంగా భరతమాత, శ్యాంప్రకాశ్ ముఖర్జీ , దీన్ దయాల్ ఉపాధ్యాయ, ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోలకు పూలమాలలు వేశారు. అనంతరం మంచిర్యాలకు చెందిన ప్రముఖ వైద్యులు పూజారి రమణ, శ్రీనివాస్ లను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి లను వైద్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, ఇన్ చార్జి గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ మునిమందా రమేశ్, అగల్ డ్యూటీ రాజు, జిల్లా ఆంజనేయులు, లీడర్లు వెంకటేశ్వరరావు ,రజినీష్ జైన్, తుల ఆంజనేయులు, పెద్దపల్లి పురుషోత్తం , శ్రీదేవి, పట్టి వెంకటకృష్ణ, పానుగంటి మధు తదితరులు పాల్గొన్నారు.