ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ నేపథ్యంలో ఖమ్మం మమత రోడ్డులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్తమ బౌన్సర్ల తో స్టూడెంట్ సంఘాల లీడర్లపై దాడి చేయించడాన్ని నిరసిస్తూ గురువారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పర్మిషన్ లేని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను సీజ్ చేసి, దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్ సంఘాల ఆందోళన కొద్దిసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. స్కూల్ బోర్డును ఆగ్రహంతో ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని ఆందోళన విరమింపజేశారు.
తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బిల్డింగ్ ను డీఈవో సోమశేఖర శర్మ, ఎంఈవో శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ టైంలో స్కూల్ మేనేజ్మెంట్ లేరు. తనిఖీలో కమర్షియల్ కాంప్లెక్స్ లో స్కూల్ కొనసాగడాన్ని ఆఫీసర్లు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ లేదు. స్టూడెంట్స్ కు ప్లే గ్రౌండ్ లేదని తేల్చారు. ఎంక్వైరీ చేసి ఉన్నతాధికారులకు రిపోర్టు అందిస్తామని డీఈవో తెలిపారు. ఇంటర్నేషనల్ అనే పేరుతో స్కూల్ నడిపిస్తుండడంతో రూ.25 వేలు ఫైన్ విధించినట్లు చెప్పారు. విచారణ పూర్తి చేసి స్కూల్ ను సీజ్ చేయనున్నట్లు తెలిపారు. పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటికల రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ పాల్గొన్నారు.