
ప్లాస్టిక్... ఒకప్పుడు ఇది ఒక వరంలా అనిపించింది. అదే ఇప్పుడు శాపంగా మారింది. ఒక మనిషి తన డైలీ లైఫ్‌లో ఎన్ని రకాలుగా ప్లాస్టిక్ వాడుతున్నాడో చెప్పనక్కర్లేదు. అవసరమైన మేరకు వాడితే ఏదీ నష్టం కాదు. మితిమీరితేనే మొదటికి మోసం వస్తుంది. ప్లాస్టిక్ విషయంలోనూ అదే జరుగుతోంది. దీని వాడకం పెరిగే కొద్దీ ప్రాణకోటికి పెను ముప్పుగా మారుతోంది
అప్పుడే తెలిసింది కానీ..
1907లో తొలిసారి మాడ్రన్ ప్లాస్టిక్ బేకలైట్‌ను లియో బేక్ ల్యాండ్ అనే బెల్జియన్ కెమిస్ట్ అమెరికాలో కనుగొన్నాడు. అప్పుడు దాన్ని ఎలక్ట్రిక్ వైరింగ్‌లో వాడారు. తర్వాత దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చని తెలిసింది. కొన్నేళ్లలోనే రకరకాల ప్లాస్టిక్ వెరైటీలు, వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. 1939 –45 మధ్య అంటే ప్రపంచ యుద్ధం టైంలో ప్లాస్టిక్ వాడకం పెరిగింది. 1980లోనే ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై చర్చలు మొదలయ్యాయి. కానీ, దానివల్ల ప్లాస్టిక్ అసలు లక్షణం కోల్పోతుందని, అలా తయారుచేసిన వాటిని వాడలేమని గుర్తించి రీసైక్లింగ్ చేయడం తగ్గించాయి. 2004లోనే ప్లాస్టిక్ వస్తువులు మైక్రో ప్లాస్టిక్లుగా మారుతున్నాయని సైంటిస్ట్‌లు కనుగొన్నారు. వాటిని సముద్ర జీవులు తింటున్నాయని తెలుసుకున్నారు. దానివల్ల వాటి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని గుర్తించారు. కానీ, ప్లాస్టిక్ తయారీ కంపెనీలు తీసేస్తే ఎంతోమంది జీవనోపాధి పోతుందని వెనక్కి తగ్గారు. తర్వాత రీసైక్లింగ్, కంట్రోలింగ్ మీద ఫోకస్ చేశారు.