మెదక్ జిల్లాలో చిరుత!..ఆందోళనలో ప్రజలు,రైతులు

మెదక్ జిల్లాలో చిరుత!..ఆందోళనలో ప్రజలు,రైతులు
  • పిల్లలతో సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు 
  •  పొలాల వద్దకు వెళ్లాలంటే జంకుతున్న రైతులు

మెదక్, వెలుగు: జిల్లాలోని పలు మండలాల పరిధిలో చిరుతపులి సంచారం ప్రజలను, రైతులను తీవ్ర  భయాందోళనకు గురి చేస్తోంది. పొలాల దగ్గరకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు చిరుత ఊర్లోకి వస్తుందేమో అని ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న రామాయంపేట, హవేలీ ఘనపూర్, చేగుంట, చిన్నశంకరంపేట, పాపన్నపేట, తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల పరిధిలో చిరుత పులి సంచరిస్తున్న ఆనవాళ్లు వెలుగుచూశాయి. 

ప్రమాదంలో ఒక చిరుత మృతి

రామాయంపేట, చేగుంట, నార్సింగి అటవీ ప్రాంతంలో సంచరించే చిరుత పులి కొన్ని నెలల కిందట 44 నెంబర్ నేషనల్ హైవే రోడ్డు దాటుతున్న క్రమంలో చేగుంట మండలం వల్లూరు గ్రామం దగ్గర గుర్తు తెలియని వెహికల్ ఢీ కొట్టడంతో మృతి చెందింది. నెలన్నర రోజుల కిందట రామాయంపేట పట్టణ  శివారులో మరో చిరుత సంచారం వెలుగుచూసింది. కొయ్యగుట్ట ప్రాంతంలో మున్సిపల్ డంప్ యార్డు ఉండడంతో ఊర కుక్కల సంచారం ఎక్కువగా ఉంటోంది. వాటి కోసం చిరుత ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. 

ఆ ప్రాంతంలో ఉండే పొలాల వద్దకు రైతులు, మహిళలు ఒంటరిగా వెళ్లొద్దని, కట్టెలు పట్టుకుని గుంపులుగా వెళ్లాలని సూచించారు. అలాగే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఫారెస్ట్ సిబ్బంది అక్కడే కాపలా కాస్తూ రైతులకు ధైర్యం కల్పిస్తున్నారు. చిరుతను అటవీ ప్రాంతానికి పంపేందుకు రాత్రి సమయంలో క్రాకర్స్ కాల్చడంతో పాటు, భారీ శతాబ్దాలు చేస్తున్నారు. తాజాగా మాసాయిపేట, తూప్రాన్ మండలాల పరిధిలో చిరుత పులి తన పిల్లలతో సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆయా మండలాల పరిధిలో అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దని పశువులను పొలాల వద్ద కట్టేయొద్దని సూచించారు. 

పశువులపై దాడి

ఇటీవల రామాయంపేట, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలో పొలాల దగ్గర కట్టేసిన పశువులపై చిరుత దాడి చేసి చంపేసింది.  ఫిబ్రవరి 12న రామాయంపేట మండలం లక్ష్మాపూర్​కు చెందిన దాసరి ఎల్లయ్య లేగదూడను చిరుత చంపేసింది. అదే నెల 21 న రామాయంపేట పట్టణ శివారులో వ్యవసాయ పొలం వద్ద కట్టేసిన గోల్పర్తి గ్రామానికి చెందిన స్వామి దూడపై చిరుత దాడి చేసి చంపింది. మార్చిలో అదే గ్రామానికి చెందిన పేరాణి లింగం పొలం వద్ద కుక్కను కట్టి వేయగా దానిని చిరుత చంపి తిన్నది.