ట్రంప్కు షాక్: పదేండ్ల పాలనకు బ్రేక్ పడే టైమ్లో.. కెనడాలో అధికారం దిశగా లిబరల్ పార్టీ

ట్రంప్కు షాక్: పదేండ్ల పాలనకు బ్రేక్ పడే టైమ్లో.. కెనడాలో అధికారం దిశగా లిబరల్ పార్టీ

‘శత్రువు నుంచి మేలే జరుగుతుంది’’ అనే నానుడి కొన్నిసార్లు నిజమవుతుంది. పదేండ్లపాటు అధికారంలో ఉండి.. ప్రభుత్వ వ్యతిరేకత, గత ప్రధాని ట్రూడో విధానపరమైన లోపాల కారణంగా కెనడాలో లిబరల్ పార్టీ అధికారానికి దూరమవ్వటం ఖాయమని అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ విశ్లేషించారు. ఇన్నాళ్లుగా ప్రభుత్వం నుంచి దిగిపోవాలని వ్యతిరేకించిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీకి పట్టం కట్టడం అంటే.. అది  ట్రంప్ పుణ్యమేనని చెప్పవచ్చు. కెనడాలో జరిగిన ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే అణచేయాలని చూసి పరోక్షంగా యూఎస్ ఎంత మేలు చేసిందో స్పష్టంగా ఊహించవచ్చు.

అమెరికా పొరుగు దేశం కెనడాలో ఎన్నికల ఫలితాలు ఇవాళ (కెనడా కాలమానం ప్రకారం ఏప్రిల్ 27) విడుదలవుతున్నాయి. లిబరల్స్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీలకు మధ్య ఉన్న తీవ్ర పోటీలో మరోసారి లిబరల్స్ అధికారం కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తున్నారు. లిబరల్స్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రధానిగా ట్రూడో తప్పుకున్న తర్వాత ప్రధాని పదవి చేపట్టిన మార్క్ కార్నీ ఈ ఎన్నికల్లో గెలిచి తన పదవిని కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వరుసగా నాలుగోసారి లిబరల్స్ అధికారం చేపట్టనున్నారు. 

ఇప్పటి వరకు అందిన లేటెస్ట్ ఫలితాల ప్రకారం లిబరల్స్ 133 స్థానాల్లో గెలుపొంది మరో 28 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. పియరీ పోయిలివ్రీ అధ్యక్షతన కన్జర్వేటివ్ పార్టీ 123 సీట్లలో విజయం సాధించింది. మరో 27 స్థానాల్లో లీడ్ లో ఉంది.  కెనడాలో మెజారిటీ రావాలంటే 172 సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఎర్లీ ట్రెండ్స్ లో ఏ పార్టీ 172 స్థానాలకు పైగా లీడ్ లోకి రాలేదు. పియరీ పోయిలివ్రీ అధ్యక్షతన కన్జర్వేటివ్ పార్టీ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. కెనడాలో లిబరల్స్ ను అధికారానికి దూరం చేసి తన అనుకూల పార్టీని గెలిపించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యేలా కనిపిస్తున్నాయి. 

కెనడాపై టారిఫ్ లు విధించడంతో పాటు తమ ఆధిపత్యం కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలతో కెనడా సార్వభౌమత్వం ప్రశ్నార్థకంలో పడినట్లు అయ్యింది. అంతే కాకుండా కెనడా యూఎస్ లో 51 స్టేట్ గా ఉంటుందని, కెనడాను తమ దేశంలో కలిపేసుకుంటామని ట్రంప్ బెదిరిస్తూ వస్తున్నాడు. టారిఫ్ ఆంక్షలు ఉండకూడదంటే, బార్డర్ ఆంక్షల నుంచి తప్పించుకోవాలంటే తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని ఎన్నోసార్లు హెచ్చరించాడు.  దీంతో లిబరల్స్ పై ఉన్న అప్పటిదాకా ఉన్న వ్యతిరేకత కాస్త.. ట్రంప్ కు ధీటుగా దేశ సార్వభౌమాధికారం కోసం నిలిచే పార్టీ కావాలనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేకతను పక్కనపెట్టి మరోసారి లిబరల్స్ వైపో మొగ్గు చూపినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

ట్రూడో తర్వాత అధికారం చేపట్టిన కార్నీ.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని, కెనడాను మరో ఆర్థిక శక్తిగా తయారు చేస్తానని ట్రంప్ కు ధీటుగా సమాధానాలు ఇస్తూ వస్తున్నాడు. ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా తెగిస్తామని చెప్పడంతో స్థానిక ప్రజలను ఆకర్శించింది. దీంతో కన్జర్వేటివ్స్ వైపు మొగ్గుచూపారు ఓటర్లు. కానీ రెండు పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉండటంతో.. మైనారిటీ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాలు నెలకొన్నాయి.