
- ఆఫీసుకు తాళం వేసి ఉండడంతో లైబ్రెరీ చైర్మన్ ఆగ్రహం
శాయంపేట, వెలుగు: గ్రంథాలయం ఆదివారం మూసి ఉంచడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేట గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రీడింగ్ రూంలోని న్యూస్ పేపర్లు, పాఠకుల సంతకాల రిజిస్టర్‌ను పరిశీలించారు. కేవలం న్యూస్ పేపర్లకు సంబంధించిన రీడింగ్‌రూమ్ మాత్రమే తీసి ఉంచి, ఆఫీసుకు తాళం వేసి ఉండడంతోపాటు లైబ్రేరియన్ సుధాకర్ విధులకు హాజరుకాకపోవడంతో అక్కడే ఉన్న సిబ్బందిపై మండిపడ్డారు.
పాఠకులు సైతం లైబ్రేరియన్ విధులకు సక్రమంగా హాజరు కాడని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. మెమో ఇష్యూ చేస్తామన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలని, పాఠకులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఆయనవెంట జూనియర్ అసిస్టెంట్ సంతోష్ ఉన్నారు.