
- పోతాయిపల్లి, బోనాల్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
- త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తాం : రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్
- రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన
లింగంపేట,వెలుగు: భూ భారతికి పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన లింగంపేట మండలంలోని గురువారం రెవెన్యూ సదస్సులు షురూ అయ్యాయి. పోతాయిపల్లిలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, బోనాల్ గ్రామంలో ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ సదస్సులను ప్రారంభించారు. తొలి రోజు వివిధ భూ సమస్యలపై 308 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో మాట్లాడుతూ దరఖాస్తులను పరిశీలించి 30 నుంచి 90 రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. భూ భారతికి లింగంపేట మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం మండలవాసుల అదృష్టమన్నారు. ధరణి పోర్టల్‌లోని అవకతవకలను సరి చేయడం వల్ల రైతులకు న్యాయం చేకూరనుందన్నారు. సాదాబైనామాలు, ఫౌతి కేసులు, సర్వే నంబర్ మిస్సింగ్‌లు, డిజిటల్సైన్ పెండింగ్ వంటి సమస్యలు పరిష్కారం కానున్నాయన్నారు.
ఫారెస్ట్, రెవెన్యూ భూములకు సంబంధించిన కేసులను ఇరు శాఖల అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి పరిష్కరిస్తామని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం కానీ పక్షంలో ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను దరఖాస్తు ఫారంలో పూర్తి చేసి అధికారులకు ఇవ్వాలని సూచించారు. పోతాయిపల్లి గ్రామంలో 62 సర్వే నంబర్లో 185 ఎకరాల వ్యవసాయ భూములు రైతుల పేరిట ఉండగా, ధరణిలో నమోదు కాలేదని రైతులు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామ శివారులోని 543, 830 సర్వేనంబర్ల లోని భూములు రెవెన్యూ, ఫారెస్ట్‌శాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్నందున పట్టాలు రావడం లేదని రైతులు వాపోయారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఓంకార్, గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, ఎల్లారెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, రెవెన్యూ, ఫారెస్టు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
మొదటి రోజు దరఖాస్తులు ఇలా..
తొలి రోజు రెవెన్యూ సదస్సులో భాగంగా పోతాయిపల్లి గ్రామంలో 261, బోనాల్ గ్రామంలో 47 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ సురేశ్ తెలిపారు. ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం సాదాబైనామాలు, ఫౌతీ కేసులు, మ్యూటేషన్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
భారీగా తరలివచ్చిన రైతులు
రెండు గ్రామాల్లోని రెవెన్యూ సదస్సులకు రైతులు భారీగా తరలివచ్చారు. ఏండ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. వందలాది మంది రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులను వేడుకోవడం
కనిపించింది.
పదేళ్లుగా నిరీక్షిస్తున్నా...
నాకు గతపదేళ్లుగా 30 గుంటల వ్యవసాయభూమి కొత్త పాస్‌పుస్తకంలో నమోదు కాలేదు. ఎన్నో సార్లు రెవెన్యూ ఆపీసర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. పోతాయిపల్లి శివారులోని 858/అ,481/ఉ,480/ఊ సర్వే నెంబర్లలోని భూమి తన పేరిట నమోదు కాలేదు. ఇప్పుడు మరల దరఖాస్తు చేయడానికి వచ్చాను.
నీరడిసులోచన. పోతాయిపల్లి