- ఆఫ్రికాలో రెండు మృగరాజుల అడ్వెంచరస్ జర్నీ
- డ్రోన్ కెమెరాలతో వాటి ప్రయాణాన్ని చిత్రించిన పరిశోధన బృందం
కంపాలా (ఉగాండా): ఆడతోడు కోసం రెండు మగ సింహాలు సాహసం చేశాయి. మొసళ్లతో నిండిన 1.3 కిలోమీటర్ల పొడవున్న నదిని ఈది అవతలి ఒడ్డుకు చేరుకుని రికార్డ్ క్రియేట్ చేశాయి. అందులో ఒకదానికి మూడు కాళ్లు మాత్రమే ఉండటం మరో విశేషం. ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్ లో ప్రచురితమైన తాజా స్టడీ ప్రకారం.. ఆఫ్రికా దేశం ఉగాండాలోని క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్కులో లేడీ లయన్స్ సంఖ్య తగ్గిపోయింది. అక్కడున్న కొద్ది ఆడ సింహాల కోసం మగ సింహాల మధ్య కాంపిటీషన్ ఎక్కువైంది. దాంతో పార్కు గుండా ప్రవహించే ప్రమాదకరమైన నది(కజింగా ఛానల్) అవతలి వైపు ఆడ సింహాలు ఉండొచ్చనే ఆశతో రెండు మగ సింహాలు రిస్క్ తో కూడిన ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి.
నాలుగో ప్రయత్నంలో సక్సెస్
రెండు సింహాల్లో ఒకటైన 'జాకబ్’ అత్యంత బలమైనది. అడవి దున్నలు, వేటగాళ్ల దాడులు, విష ప్రయోగాలను ఎదుర్కొన్నది. ఓ ఇనుప ఉచ్చులో చిక్కుకుని ఒక కాలును కూడా కోల్పోయింది. అది 1.3 కి.మీ. దూరం నదిలో మూడు కాళ్లతోనే ఈత కొట్టింది. అంతేగాక తన సోదర సింహానికి (టిబు) దారి చూపింది. తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో నదిని దాటేందుకు ఈ రెండు సింహాలు యత్నించాయి. కొంతదూరం వెళ్లగానే నీటిలోని జంతువుల ముప్పుతో వెనక్కి వచ్చాయి. ఇలా మూడుసార్లు విఫల యత్నం చేశాయి.
అయినా.. పట్టు విడవకుండా నాలుగో ప్రయత్నంలో భాగంగా ఫిబ్రవరి 4న విజయవంతంగా నదిని ఈది అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి. వీటి సాహస యాత్రను ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు అలెగ్జాండర్ బ్రాజ్కో స్కీ టీమ్ డ్రోన్ కెమెరాలతో వీడియో తీసింది. సింహాల లింగ నిష్పత్తులు గణనీయంగా తగ్గిపోయాయనడానికి ఈ రెండు సింహాలు చేసిన సాహసమే నిదర్శనమని ఆమె చెప్పారు. జర్నీలో వాటి ప్రతి కదలికలను ప్రత్యేక కెమెరాలు, డ్రోన్ల ద్వారా చిత్రీకరించామని తెలిపారు. అయితే, ఆ రెండు మగ సింహాలకు నది ఆవలి వైపునైనా ఆడ తోడు దొరికిందా? లేదా? అన్నది మాత్రం వెల్లడికాలేదు!