ఖమ్మం జిల్లాలో లిక్కర్ అమ్మకాలు డౌన్! ఏపీ లిక్కర్​ పాలసీ ఎఫెక్ట్​తో పడిపోయిన సేల్స్​

ఖమ్మం జిల్లాలో లిక్కర్ అమ్మకాలు డౌన్! ఏపీ లిక్కర్​ పాలసీ ఎఫెక్ట్​తో పడిపోయిన సేల్స్​
  •  ఈనెల కూడా టార్గెట్ అందుకోవడం కష్టమే!
  •  గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈసారి తగ్గిన రూ.10కోట్ల అమ్మకాలు 
  •  ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా రెండ్రోజులు వైన్ షాప్ లు బంద్
  •  ఏపీ ప్రభావంతో ఇప్పటికే తగ్గిన మద్యం అమ్మకాలు

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లిక్కర్​ సేల్స్ పడిపోతున్నాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, గత మూడు నెలలుగా మద్యం అమ్మకాల్లో డౌన్​ ట్రెండ్ కొనసాగుతోంది. ఈనెల కూడా టార్గెట్ ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.10 కోట్ల మేరకు అమ్మకాలు తగ్గాయి. గతేడాది ఫిబ్రవరిలో 20వ తేదీ వరకు రూ.75 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఈసారి మాత్రం రూ.65 కోట్లకే పరిమితమయ్యాయి.

 టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఈనెలలో రెండ్రోజుల పాటు మద్యం దుకాణాలు మూసేయనున్నారు. ఈనెల 25న సాయంత్రం 4 గంటల నుంచి ఈనెల 27న సాయంత్రం 4 గంటల వరకు వైన్​ షాపులు, బార్లు క్లోజ్​ చేయనున్నారు. ఇప్పటికే అమ్మకాల్లో వెనకబడగా, ఇందులోనే రెండ్రోజులు షాపులు బంద్​ ఉండడంతో సేల్స్​ మరింత తగ్గుతాయని వైన్ షాపుల యజమానులు చెబుతున్నారు. మరోవైపు సేల్స్ పెంచేందుకు అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. డిపో నుంచి స్టాక్​ తీసుకోవాలంటూ లైసెన్స్​ దారులపై ఒత్తిడితెస్తున్నారు. 

‘ఏపీ’ ఎఫెక్ట్​...

ఏపీలో మద్యం రేట్లు  తగ్గడంతో ఆ ప్రభావం ఉమ్మడి జిల్లాలో లిక్కర్​ సేల్స్​పై పడింది. గత నాలుగేళ్లుగా ఏపీలో బ్రాండెడ్​ లిక్కర్​ అందుబాటులో లేకపోవడంతో ఏపీ నుంచి వచ్చి మన బోర్డర్​ షాపుల్లో స్టాక్​ కొనుక్కొని తీసుకెళ్లేవారు. గతేడాది అక్టోబర్​ లో ఏపీలో కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి అన్ని బ్రాండ్లు అక్కడ అందుబాటులోకి రావడం, మద్యంపై రేట్లు కూడా తగ్గించడంతో ఇక్కడ నుంచి సరుకు తీసుకెళ్లే పరిస్థితికి బ్రేక్​ పడింది. దీంతో ప్రధానంగా సత్తుపల్లి, మధిర, వైరా, ఖమ్మం 1, అశ్వారావుపేట ఎక్సైజ్​ సర్కిళ్ల పరిధిలో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. 

రూ.కోట్లల్లో పడిపోతున్న అమ్మకాలు.. 

ఖమ్మం జిల్లాలో 2023 డిసెంబర్​ లో రూ.166 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, గతేడాది డిసెంబర్​ లో రూ.136 కోట్లకు పడిపోయాయి. గతేడాది జనవరిలో రూ.134 కోట్లు కాగా, ఈ ఏడాది జనవరిలో రూ.118.62 కోట్లకు తగ్గాయి. గతేడాది ఫిబ్రవరిలో 20వ తేదీ వరకు రూ. 75 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఈసారి రూ. 65 కోట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఈనెలాఖరులో రెండ్రోజులు డ్రై డేగా ఉండడంతో లిక్కర్​ అమ్మకాలు గతేడాది కంటే మరింత తగ్గనున్నాయి. 

ఫలించని ఆఫీసర్ల ప్రయత్నాలు.. 

ఇప్పటికే అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే పడిపోతున్న మద్యం అమ్మకాలను పెంచేందుకు, కనీసం టార్గెట్ రీచ్​ అయ్యేందుకు జిల్లా ఎక్సైజ్​ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎక్సైజ్​ సీఐలు, సిబ్బంది ద్వారా లైసెన్స్​ దారులపై మరింత స్టాక్​ తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నా, షాపుల యజమానులు మాత్రం నిరాకరిస్తున్నారు. షాపులో ఆల్రెడీ ఉన్న స్టాక్​ ను అమ్ముకునేందుకు తిప్పలుపడుతున్నామని, కొత్తగా స్టాక్​ తెచ్చి ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఏ నెలకు ఆ నెల టార్గెట్ కోసం తమపై ఒత్తిడి తెస్తే ఎలా అని బాధపడుతున్నారు. 

ఇక రేట్లు పెంచితే అంతే.. 

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రంలో మద్యంపై 15 శాతం వరకు రేట్లు పెంచొచ్చన్న ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ రేట్ల పెంపు జరిగితే మద్యం అమ్మకాలపై మరింత ప్రభావం పడుతుందని, ఇంకా అమ్మకాలు పడిపోతాయని ఎక్సైజ్​ సిబ్బందే కామెంట్ చేస్తున్నారు. 

గతేడాదికి ముందు వరకు ఇక్కడి నుంచి ఏపీకి సరకు వెళ్లేదని, రేట్లలో రెండు రాష్ట్రాల మధ్య తేడా మరింత పెరిగితే ఈసారి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం మద్యం అమ్మకాలు, రేట్ల పెంపుపై మాట్లాడేందుకు ఆఫీసర్లు నిరాకరిస్తున్నారు.