- లోకల్‌బాడీ ఎలెక్షన్స్ కోసం ఆఫీసర్ల కసరత్తు
- పల్లెల వైపు పలు పార్టీల చూపు
వనపర్తి, వెలుగు : ఉమ్మడిపాలమూరు జిల్లాలో గతంతో పోలిస్తే ఓటర్లు పెరిగారు. మొత్తం 23,22,054 మంది ఓటర్లున్నారు. ఇందులో 11,54,128 మంది పురుష ఓటర్లు కాగా, 11,67,893 మంది మహిళా ఓటర్లున్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 33 ఉన్నాయి. ఈ లెక్కన మొత్తం మీద 13,765 మంది మహిళా ఓటర్లు పురుషులకన్నా ఎక్కువగా ఉన్నారు.
నాలుగు జిల్లాల్లో మహిళలే ఎక్కువ..
ఉమ్మడిమహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూలు జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా నారాయణపేట జిల్లాలో ఎక్కువగా అంటే పురుషుల కంటే 7348 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. తరువాత జోగులాంబ గద్వాల జిల్లాలో 5,562 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,118 మంది, వనపర్తి జిల్లాలో 753 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
17,047జీపీ,మండల, వార్డులకు ఎన్నికలు
లోకల్ బాడీ ఎలెక్షన్స్‌కు ఎప్పుడు గంట మోగినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 17,047 గ్రామపంచాయతీ, మండల పరిషత్, వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 71 మండలాలు, 1700 గ్రామపంచాయతీలు, 15,276 వార్డులు ఉన్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో అత్యధిక మండలాలు, పంచాయతీలు, వార్డులు, థర్డ్ జెండర్ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. చిన్న జిల్లా అయిన నారాయణపేట మండలాలు తక్కువ ఉన్నా పంచాయతీలు, వార్డులు, ఓటర్లలో మూడో స్థానంలో ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే పూర్తవడంతో రిజర్వేషన్ల పెంపుపై బీసీల్లో ఆశాభావం వ్యక్తం అవుతోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో గతంలో సీటు దక్కని వారు ఈ సారి బీసీ సర్వేను పరిగణనలో ఉంచుకుని ఫలానా గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీటు బీసీలకు కేటాయించవచ్చన్న అంచనాలను వేసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ ఎప్పుడు లోకల్ బాడీ ఎలెక్షన్లకు పచ్చజెండా ఊపినా అందుకు తాము సన్నద్దంగా ఉండాలని ఆఫీసర్లు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆశావహుల ప్రదక్షిణలు
త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుందన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ప్రజప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు పల్లె బాట పట్టారు. పల్లె ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అటు పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీల నాయకులు జోరుగా పల్లెలను పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే బీసీ గణన పూర్తయిన దృష్ట్యా ఆయా సీట్లను పొందేందుకు ఆశావహులు ఎమ్మెల్యే, పార్టీలోని అధినాయకులు, కార్పొరేషన్ ఛైర్మన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.