ODI World Cup 2023: నా వ్యూహం అదే.. కోహ్లీని ఔట్ చేయడానికి 5 బంతులు చాలు: నెదర్లాండ్స్ బౌలర్

స్టార్ బౌలర్ ఎవరైనా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ తీయగలను అని ఇప్పటివరకు చెప్పిన సందర్భాలు లేవు. దానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా సవాళ్ళను ఇష్టపడే కోహ్లీ.. గ్రౌండ్ లో ఎవరైనా కవ్విస్తే అంతకు మించి సమాధానం చెబుతాడు. ఇప్పటివరకు చాలా  మంది బౌలర్లు ఈ లిస్టులో ఉన్నారు. అయితే నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ వాన్ బీక్ మాత్రం కేవలం 5 బంతుల్లో కోహ్లీని అవుట్ చేస్తానని ఛాలెంజ్ చేసాడు.

వాన్ బీక్ మంచి బౌలరే అయినప్పటికీ ఈ రకమైన స్టేట్ మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. కానీ అతని సమాధానం వింటే షాకవ్వాల్సిందే. ఈ సందర్భంగా వాన్ బీక్ మాట్లాడుతూ "కోహ్లీకి నేను బౌలింగ్ చేస్తే మొదటి రెండు బంతులు అవుట్ స్వింగర్లు, ఆ తర్వాత రెండు బంతులని ఒక స్లో బాల్, ఆఫ్‌కట్టర్ స్లోబాల్ వేస్తా. కోహ్లీ ఈ నాలుగు బంతుల్లో ఒక ఫోర్ కొడతాడు. ఇలా నాలుగు బంతులు వేసిన తర్వాత క్రికెట్ దేవుళ్లపై భారం వేసి కోహ్లీ వికెట్ ఇవ్వు దేవుడా అని కోరుకుంటాను" అని చెప్పాడు. మొత్తానికి కోహ్లీ వికెట్ తీయాలంటే సామాన్యులకు సాధ్యం కాదని వాన్ బీక్ చెప్పకనే చెప్పాడు. 

 
ఇప్పటికే  భారత్ లో అడుగు పెట్టిన డచ్ దేశం కర్ణాటకతో ప్రాక్టీస్ మ్యాచు ఏర్పాటు చేసుకొని భారీ తేడాతో ఓడిపోయింది . వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో 6 న తొలి మ్యాచ్ ఆడుతుండగా టీమిండియాతో మాత్రం నవంబర్ 12 న మ్యాచ్ ఉంది. ఇక వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో పెద్ద జట్లకు సైతం షాకిస్తూ వన్డే వరల్డ్ కప్ కి అర్హత సాధించిన నెదర్లాండ్స్ ఎన్ని విజయాలు సాధిస్తుందో చూడాలి.