ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లపై ఎంక్వైరీ షురూ

  • పంచాయతీకో టీమ్ ఏర్పాటు 
  • గ్రౌండ్ లెవల్​లో విచారణ ప్రారంభం
  • టీమ్స్​కు ఎల్ఆర్ఎస్ ఎంక్వైరీ యాప్​  
  • 421 పంచాయతీలు, 6 మున్సిపాలిటీలు
  • జిల్లాలో 2.50 లక్షల అప్లికేషన్లు

యాదాద్రి, వెలుగు : ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) అప్లికేషన్లపై యాదాద్రి జిల్లాలో వెరిఫికేషన్​ మొదలైంది. అక్టోబర్ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం పనులు​ ప్రారంభించింది.  

2.50 లక్షల అప్లికేషన్లు..

అక్రమంగా చేసిన లే అవుట్లను క్రమబద్ధీకరించడానికి అప్పటి బీఆర్ఎస్ ​ప్రభుత్వం 2020లో అప్లికేషన్లను ఆహ్వానించింది. 2020 ఆగస్టు 26 కంటే ముందుగా కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్లాట్​కు రూ.వెయ్యి, వెంచర్​కు రూ.10 వేలుగా ఫీజు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో లే అవుట్ల క్రమబద్దీకరణకు భారీ స్పందన వచ్చింది. మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, 421 గ్రామ పంచాయతీల్లో మొత్తం 2.50 లక్షల అప్లికేషన్లను స్వీకరించారు. 

ఇందులో 30 వేల అప్లికేషన్లకు పైగా అప్పట్లోనే పరిష్కరించారు. ఆ తరువాత క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ అప్పట్లో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఎల్ఆర్ఎస్ పెండింగ్​లో పడింది. అయితే అప్పటికే నిర్మాణాలు చేపట్టిన కొందరు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా కొన్ని ప్లాట్లను క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం 2.20 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఇందులో మున్సిపాలిటీల పరిధిలో 65 వేలు, పంచాయతీల్లో 1.55 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆఫీసర్లు వర్క్​ప్రారంభించారు.  

ప్రత్యేక టీమ్స్​ఏర్పాటు..

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్ఆర్ఎస్​అప్లికేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్​–1 టీమ్ మెంబర్లు గ్రౌండ్​లెవల్​లో ఎంక్వైరీ చేయనున్నారు. ఇందుకోసం ప్రతి పంచాయతీకి ఎల్​–-1 పేరుతో ప్రత్యేకంగా ఒక్కో టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్​లో రెవెన్యూ ఇన్​స్పెక్టర్, ఇరిగేషన్​ ఏఈ, పంచాయతీ సెక్రటరీ మెంబర్లు ఉంటారు. మున్సిపాలిటీల్లో సెక్రటరీకి బదులుగా టౌన్ ప్లానింగ్​ఆఫీసర్ ఉంటారు. ఈ ఎంక్వైరీ కోసం సెంటర్​ఫర్​గుడ్​గవర్నెన్స్​ LRS–2020 Inspection పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన యాప్​ను టీమ్ మెంబర్లు డౌన్​లోడ్ చేసుకున్నారు.

 వీరందరికీ యూజర్​ఐడీతో పాటు పాస్​వర్డ్​ కూడా అందించారు. దీంతో ఎవరి పరిధిలోని గ్రామం లేదా వార్డుకు సంబంధించిన ఎల్ఆర్ఎస్​అప్లికేషన్లు వీరికి కన్పిస్తాయి. ప్లాటు లేదా వెంచర్​కు సంబంధించిన సర్వే నంబర్​లోని భూమి ​ప్రైవేట్ కు చెందినదైతే దాన్ని ఓకే చేస్తారు. ప్రభుత్వ, చెరువులు, వక్ఫ్, దేవాదాయ భూములకు సంబంధించిన పక్షంలో తిరస్కరిస్తారు. అనంతరం తహసీల్దార్లు కూడా వాటిని పరిశీలించి ఫీజు నిర్ణయిస్తారు. దరఖాస్తుదారులు నిర్ణీత ఫీజు చెలించిన తర్వాత స్థానిక సంస్థల మున్సిపల్ కమిషనర్లు, డీపీవో, అదనపు కలెక్టర్ స్థాయిలో పరిశీలిస్తారు. అంతిమంగా కలెక్టర్ పరిశీలించి లోపాలు ఉంటే తిరస్కరిస్తారు. అన్ని సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. ఈ ప్రక్రియ అక్టోబర్​ నెలాఖరు వరకు పూర్తిచేయాల్సి ఉంది.  

అడ్డగోలుగా అక్రమ లే అవుట్లు..

జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అడ్డగోలుగా అనధికార లే అవుట్లు వెలిశాయి. దాదాపు వెయ్యికి పైగా అక్రమ లే అవుట్లు ఉన్నాయని అంచనా. రియల్​ వ్యాపారులు యాదగిరిగుట్ట పునర్నిర్మాణాన్ని చూపిస్తూ ధరలు కూడా భారీగా పెంచి అమ్మకాలు చేపట్టారు. వచ్చిన అప్లికేషన్లలో దాదాపు1.50 లక్షల వరకు వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులతోపాటు వాటి యజమానులు ఉన్నారు. అయితే క్రమబద్ధీకరణ కోసం అప్లికేషన్ చేసుకోని వారు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు.

ఎంక్వైరీ ప్రారంభించాం-.. 

ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం అప్లయ్ ​చేసుకున్న వారి ప్లాట్లు, వెంచర్లను ఎంక్వైరీ చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్స్​ ఏర్పాటు  చేశాం. ప్లాట్లు, వెంచర్లు పరిశీలించిన తర్వాత వాటికి సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్​లో నమోదు చేస్తాం.

ఆర్. సునంద, డీపీవో, యాదాద్రి జిల్లా