- కుటుంబసభ్యులకు సంక్షేమ పథకాలు అందించాలి
- ఏడాదికి రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించాలి
సంగారెడ్డి టౌన్ ,వెలుగు: జిల్లాలోని సఫాయి కార్మికులు, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేశన్ పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో గురువారం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి జిల్లాలోని సఫాయి కార్మికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా సఫాయి కార్మికులకు ప్రభుత్వ పథకాలను అమలు చేసి కుటుంబసభ్యులకు స్వయం ఉపాధి పథకాల ద్వారా రుణాలు ఇప్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని మున్సిపల్ సఫాయి కార్మికులకు నెల రోజుల్లోగా గుర్తింపు కార్డులు, ఈపీఎఫ్ ఖాతా నెంబర్లు అందించాలని ఆదేశించారు.
సఫాయి కార్మికుల సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. సేఫ్టీ కిట్స్, మాస్కులు, సబ్బులు, ఆయిల్,షూ, గ్లౌజులు, యూనిఫామ్ వంటి సామగ్రి అందించాలన్నారు. సఫాయి కార్మికులు తమ సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ కు 01124648924 కు ఫిర్యాదు చేసుకుని పరిష్కరించుకోవచ్చని సూచించారు. అపరిశుభ్ర వాతావరణంలో పని చేస్తున్నందున ఏడాదికి రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల్లోత్రిలో నియమించి ఉపాధి అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి బీమా యోజన పథకంపై అవగాహన కల్పించాలని, అందులో చేరేలా చూడాలన్నారు.
అంతకుముందు జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ కు కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, అడిషనల్ ఎస్పీ సంజీవరావు, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఆర్ఓ పద్మజారాణి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీశ్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు .