కేంద్ర ప్రభుత్వ ‘గోబర్ ధన్ స్కీం’కు వరంగల్, నిజామాబాద్ ఎంపిక – ఓరుగల్లులో చెత్త సమస్యకు ఇక చెక్
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో వేదిస్తున్న చెత్త సమస్యకు పరిష్కారం లభించనుంది. కేంద్ర ప్రభుత్వ గోబర్ ధన్ స్కీమ్ ద్వారా నగరం గార్బెజ్ ఫ్రీ కానుంది. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 లో భాగంగా ఈ స్కీమ్ రాష్ట్రం నుంచి నిజామాబాద్, వరంగల్‌కు స్థానం దక్కింది. దీంతో ఈరెండు పట్టణాల్లో చెత్తను ప్రాసెస్ చేసి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. దీనికోసం ఇప్పటికే రెండు కార్పొరేషన్ల ఆఫీసర్ల నుంచి ప్రపొజల్స్ తీసుకుంది. తొందర్లోనే బయోగ్యాస్ ప్లాంట్లకు సంబంధించిన పనులు షురూ కానున్నాయి.
చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి
పట్టణాల్లో చెత్తను డంపింగ్ యార్డులో ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేయడంతో పాటు అక్కడే బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో 'గోబర్ ధన్' పథకాన్ని తీసుకొచ్చింది. వేస్ట్ టు వెల్త్ క్రియేట్ చేయాలనే నినాదంతో ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టగా.. మొదట బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, ఆ తరువాత ప్రాసెస్ చేసిన చెత్తతో ఎరువు, వెలువడిన గ్యాస్ నుంచి కరెంట్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. వెజ్ టెబుల్, ఫ్రూట్ మార్కెట్ల నుంచి వచ్చే గార్బెజ్ తో పాటు ఇండ్ల నుంచి వెలువడే తడి చెత్తను ప్రాసెస్ చేసి కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) ను ఉత్పత్తి చేస్తారు.
కేంద్ర ప్రభుత్వ స్కీమ్ తో..
కేంద్ర తాగునీరు, పారిశుధ్య శాఖ, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎరువుల శాఖ ఇలా మొత్తం 11 విభాగాల సమన్వయంతో ఈ ప్రాజెక్టుకు ముందుకు సాగనుంది. 2023– -24 బడ్జెట్ లో ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 151 జిల్లాల్లో గోబర్ ధన్ ప్రాజెక్ట్ పనులు నడుస్తుండగా.. కొత్తగా మరో 75 నగరాల్లో ఈ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.
మొదట వరంగల్.. తర్వాత నిజామాబాద్
గోబర్ ధన్ స్కీంతో ఇప్పటివరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర్ ప్రదేశ్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్లాంట్లు ఉన్నాయి. తెలంగాణలో తొలిసారి గ్రేటర్ వరంగల్ , నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వరంగల్ నగరంలో రోజు 400 టన్నుల తడి, పొడి చెత్త పేరుకుపోతోంది. దీన్నంతటినీ మడికొండ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. .ఇక్కడ స్మార్ట్ సిటీ ఫండ్స్ తో దాదాపు రూ.37 కోట్లతో చేపట్టిన బయో మైనింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. యార్డు మొత్తమ్మీద దాదాపు 5 లక్షల టన్నుల వరకు చెత్త పోగై ఉండగా.. ఇంతవరకు కేవలం లక్ష టన్నుల వరకు మాత్రమే బయోమైనింగ్ ద్వారా ప్రాసెస్ చేసిట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కాగా నగరంలో వెలువడే ఫ్రెష్ వెట్ వేస్టేజీ నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు బాలసముద్రంలో స్వచ్ఛ భారత్ కింద 2 టీపీడీ(టన్ పర్ డే) కెపాసిటీతో బయోగ్యాస్ నుంచి కరెంట్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ అది కాస్త మూలకుపడింది. నగరంలో ఫ్రెష్ వెట్ వేస్టేజీ డైలీ 20 టన్నుల వరకు వెలువడుతుండగా దాన్నంతా మడికొండకే తరలిస్తున్నారు. దీంతో గోబర్ ధన్ లో భాగంగా మడికొండ డంప్ యార్డులోనే 20 టీపీడీ కెపాసిటీతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. ఈ చెత్త సమస్య నుంచి విముక్తి లభిస్తుందని స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
త్వరలో టీమ్స్
స్వచ్ఛభారత్ మిషన్ ఫండ్స్ తో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ లు రెడీ చేస్తుండగా.. తొందర్లోనే గోబర్ ధన్ కు సంబంధించిన టెక్నికల్ టీమ్స్ కూడా ఈ రెండు నగరాలను విజిట్ చేయనున్నాయి. నివేదిక సమర్పించిన తరువాత డీపీఆర్ కు ఆమోదం లభిస్తే ప్లాంట్ల పనులు మొదలవుతాయి. ఓ వైపు బయో మైనింగ్, మరోవైపు బయోగ్యాస్ ప్లాంట్లతో చెత్త గుట్టలు కరిగిపోయి చుట్టుపక్కల గ్రామాలకు డంప్ యార్డు కష్టాలు తీరే అవకాశం కనిపిస్తోంది.
తొందర్లోనే పనులు
స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా గోబర్ ధన్ స్కీంకు గ్రేటర్ వరంగల్ తో పాటు నిజామాబాద్ సిటీ ఎంపికైంది. మడికొండ డంప్ యార్డులో చేయనున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం డీపీఆర్ దశలో ఉంది. తొందర్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తం. డీపీఆర్ కు ఆమోదం లభించిన వెంటనే టెండర్లు చేపడుతాం. రెండు, మూడు నెలల్లోనే మడికొండలో బయోగ్యాస్ ప్లాంట్ పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
- డా.ఎం.రాజేశ్, సీఎంహెచ్వో, గ్రేటర్ వరంగల్