- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏడాదిలో 6 కోట్ల మహిళల ఉచిత ప్రయాణం
- జీరో టికెట్ల ద్వారా ఆర్టీసీకి రూ. 223 కోట్ల ఆదాయం
- కామారెడ్డి డిపో పరిధిలో 1.69 కోట్ల మంది ప్రయాణం
కామారెడ్డి, వెలుగు: ఆర్టీసీకి మహాలక్ష్మీ కటాక్షం లభించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్టీసీ డిపోల ఆదాయం గణనీయంగా పెరిగింది. మహాలక్ష్మి స్కీంతో మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ర్ట ప్రభుత్వం కల్పించింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని ఆర్టీసీ బస్సుల్లో ఏడాదిలో ఆరు కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. వీరి జీరో టికెట్లు మొత్తం ప్రభుత్వం రూ. 223 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది.
పరోక్షంగా ఈమొత్తం మహిళలకు లబ్ధిచేకూరినట్లయ్యింది. అత్యధికంగా కామారెడ్డి డిపో పరిధిలో ఫ్రీ జర్నీ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ని ఆరు ఆర్టీసీ డిపోల్లోని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించారు. గతంలో కంటే ఈ స్కీం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఆరు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. మొత్తం 582 బస్సులు ఉన్నాయి. వీటిలో పల్లె వెలుగు 317, ఎక్స్‌ప్రెస్‌లు 114, డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని బస్సులు 151 ఉన్నాయి.
Also Read :- కొమురవెల్లి మల్లన్న నిధుల ఆడిట్ అభ్యంతరాలపై చర్యలేవి?
ఉమ్మడి జిల్లాలోని ఆయాఏరియాలతో పాటు పక్క జిల్లాలు, హైదరాబాద్ తదితర ఏరియాలకు బస్సు సర్వీసులు కొనసాగుతాయి. 2023 డిసెంబర్ 15 నుంచి 2024 నవంబర్ 30 వరకు ఉమ్మడి జిల్లాలోని మొత్తం బస్సుల్లో 9,10,76,430 మంది ప్రయాణించారు. సగటున రోజుకు 2.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. టికెట్ తీసుకొని ప్రయాణించిన వారు 3,10,50,600 మంది ఉన్నారు. వీరి ద్వారా రూ. 255. 71 కోట్ల ఆదాయం సమకూరింది. మహాలక్ష్మి స్కీం ద్వారా ఉచితంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించిన మహిళలు 6,00,25,830 మంది. జీరో టికెట్లతో రూ. 223.59 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. ఆర్టీసికి మొత్తంగా రూ.479.39 కోట్ల ఆదాయం సమకూరింది.
అత్యధికంగా కామారెడ్డిలో ప్రయాణం
కామారెడ్డి డిపో పరిధిలోని బస్సుల్లో అత్యధికంగా మహిళలు ఫ్రీ జర్నీ చేశారు. ఈ డిపో పరిధిలోని అన్ని బస్సుల్లో మొత్తం 2.45 కోట్ల మంది ప్రయాణిస్తే, ఇందులో ఉచితంగా ప్రయాణించిన మహిళల సంఖ్య 1.69 కోట్లు. ఫ్రీ టికెట్ల ద్వారా ఈ డిపోకే ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా రూ. 55.44 కోట్ల ఆదాయం వచ్చింది.