హరహర మహదేవ.. జనజాతరగా మారిన ఏడుపాయల

హరహర మహదేవ.. జనజాతరగా మారిన ఏడుపాయల
  • పంచాక్షరిమంత్రంతో మార్మోగిన శివాలయాలు  
  • జనజాతరగా మారిన ఏడుపాయల  
  • అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

నెట్​వర్క్​, వెలుగు: ఉమ్మడి మెదక్​ జిల్లాలోని శివాలయాలు ఓం నమశ్శివాయ నామస్మరణతో మారుమోగాయి. జిల్లా అంతటా మహాశివరాత్రి ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.    మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయంలో శివరాత్రి జాతర అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఎల్లలు దాటి వచ్చిన భక్తులతో ఏడుపాయల జనసంద్రంగా మారింది.  రాతి గుహలో కొలువైన వన దుర్గా భవాని అమ్మవారి విగ్రహాన్ని  పూజారులు  పట్టు చీర, బంగారు కిరీటం,   పసిడిహారాలు, ముక్కుపుడక, వెండి కన్నులతో, గజమాల, నిమ్మకాయల దండలతో  విశేష అలంకరణ చేశారు.   

అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించి భక్తులు తన్మయులయ్యారు. కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంజీరా నది పాయ మధ్యలో కొలువుదీరిన మహా శివుడికి పూజలు చేశారు.   రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తరలి వచ్చిన భక్తులు మంజీరా నది పాయల్లో, షవర్ ల వద్ద స్నానాలు చేసి దుర్గమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.  సాయంత్రం ఉప వాస దీక్షలు విరమించే సమయానికి భక్తుల సంఖ్య పెరిగింది.  భక్తులు ఏడుపాయల్లోని శివాలయంలో పూజలు చేసి అక్కడే ఉపవాస దీక్షలు విరమించారు. 


 సంగారెడ్డి జిల్లా  ఝరాసంగం కేతకీ శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో  బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి.  ఆలయం చుట్టూ నాలుగు వరుసలలో భక్తులు దర్శనానికి బారులు తీరారు. 41 రోజులు నిష్టతో దీక్ష చేసిన  శివస్వాములు స్వామి వారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించారు.  దర్శనానికి ఐదు గంటల సమయం పట్టింది.  ఆలయ అధికారులు  అన్నదానం,  ఉపవాసం ఉన్న వారికి పండ్లు పంపిణీ చేశారు. జహీరాబాద్​ నుంచి  ప్రత్యేకంగా ఆర్టీసీ   బస్సులు నడిపారు.డీఎస్​పీ రాంమోహన్​రెడ్డి పర్యవేక్షణలో పోలీస్​ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

 కేతకీ ఆలయాన్ని జహీరాబాద్​ ఎంపీ సురేష్​కుమార్​ శెట్కార్​,ఎమ్మెల్యే కొనింటి మాణిక్​రావు,సంగారెడ్డి జిల్లాసెషన్​ కోర్ట్​ జడ్జి భవానిచంద్ర దంపతులు,డీసీఎంఎస్​ చైర్మన్​ మల్కాపురం శివకుమార్​,మాజీ ఎంపి బీబీ పాటీల్​,మాజీ మంత్రి చంద్రశేఖర్​,రాష్ట్ర నాయకులు నీలం మధు,జిల్లా నాయకులు ఉజ్వల్​రెడ్డి తదితరులు  దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మెదక్​ జిల్లా హవేళీ ఘనపూర్​ మండలం  ముత్తాయికోట సిద్దిరామేశ్వర స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.   సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజక వర్గంలోని   బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.