- జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలు విరివిగా సాగు
- మత్తడి దుంకుతున్న అమ్మాపురం పెద్ద చెరువు
- సమృద్ధి జలాలు, రైతు భరోసా డబ్బులు జమ కావడంతో రైతుల్లో ఆనందం
మహబూబాబాద్, వెలుగు: యాసంగి సీజన్‌కుగాను ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయడంతో జిల్లా రైతులు ఆనందంతో సాగు మొదలు పెట్టారు. వరి, మొక్క జొన్న పంటలు ఎక్కువగా సాగు చేశారు. జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజ్_1 పరిధిలో కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు, మహబూబాబాద్, చిన్నగూడురు, కురవి, డోర్నకల్ మండలాలు, ఎస్సారెస్పీ స్టేజ్_2 పరిధిలో తొర్రూరు, పెద్దవంగర, దంతాలపల్లి, మరిపెడ మండలాల పరిధిలో కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడంతో చెరువులు నిండుతున్నాయి.
తొర్రూరు మండలం అమ్మాపురం పెద్ద చెరువు మత్తడి ఉధృతంగా పోస్తుంది. మార్చి వరకు నీరు వచ్చే అవకాశాలు ఉండటంతో పంటలకు డోకా ఉండదని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. జిల్లా వ్యవసాయాధికారులు యాసంగిలో వివిధ పంటల ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాలో 2.04 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనాలు వేశారు.
2,04,018 ఎకరాల్లో పంటల సాగు..
ఈ యాసంగిలో మొత్తం 2,04,018 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వరి 92,120 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 37,513 ఎకరాలు, జొన్న 1,055, వేరుశనగ 717, నువ్వులు 92, మంచి శనిగలు 10, బొబ్బెర్లు 2,169, పెసర్లు 2,667, ఉలువలు 66, సన్ ఫ్లవర్ 375, మినుములు 580 ఎకరాల్లో సాగు చేశారు. కాగా, యాసంగిలో సైతం సన్న రకం వడ్లకు బోనస్ రూ.500 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సన్నాలకే మొగ్గు చూపారు.
సంబురంగా సాగు..
జిల్లాలో సాగునీరు పుష్కలంగా అందుతుండడంతో రైతులు సాగు సంబురంగా సాగిస్తున్నారు. మొక్క జొన్న పంట ఎక్కడ చూసినా ఏపుగా పెరిగింది. కోతుల బాధనుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు వలలు ఏర్పాటు చేసుకున్నారు. వివిధ రకాల రక్షణ చర్యలను చేపట్టారు. వరి పైరు సైతం పచ్చదనం సంతరించుకుంటుంది. ఇతర పంటలు సైతం నీటి కొరత లేకుండా ఉండటంతో ఎటూ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.
సాగులో మెలకువలు పాటించాలి..
జిల్లాలో సమృద్ధిగా నీటి వనరులు అందుబాటులో ఉన్నందున రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలను వహించాలి. ఎరువులు, పురుగు మందులను మోతాదుకు మించి వాడకూడదు. రైతులకు కావలసిన ఎరువులను అందుబాటులో ఉంచాం. యూరియా 36,712 టన్నులు, పొటాష్ 9,569 టన్నులు, డీఏపీ 5,074 టన్నులు, 20,313 టన్నుల కాంప్లెక్స్ఎరువులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పంటల సాగులో సమస్యలు ఉంటే మండల అగ్రికల్చర్ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఎం.విజయ నిర్మల, జిల్లా వ్యవసాయాధికారి, మహబూబాబాద్