అకాల వర్షాల టెన్షన్ .. వారం రోజులుగా జిల్లాలో ఈదురు గాలులతో వర్షాలు

అకాల వర్షాల టెన్షన్ .. వారం రోజులుగా జిల్లాలో ఈదురు గాలులతో వర్షాలు
  • వడ్లను కాపాడునేందుకు తిప్పలు పడుతున్న రైతులు
  • తడిస్తే నష్టం వస్తుందని ప్రైవేటులో పంట అమ్ముతున్న అన్నదాతలు.

మహబూబ్​నగర్, వెలుగు: అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాడు పగిలే ఎండలు..  సాయంత్రం నుంచి ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు వారిని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట చేతికొచ్చిన టైంలో వాతావరణంలో మార్పులు వస్తుండటం.. ఇన్​టైంకు ప్రభుత్వ కొనుగోలు సెంటర్లను ఓపెన్​ చేయకపోవడంతో వడ్లను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వ్యాపారులు రేట్లు తగ్గించి కొంటుండటంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే బోనస్​కూడా పొందలేకపోతున్నారు. 

ఇప్పటివరకు 324 మెట్రిక్​ టన్నులు సేకరణ

మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో  వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. 3,01,748 మెట్రిక్​ టన్నుల దిగుబడులు వచ్చే అవకాశాలున్నట్లు అంచనా వేసి188 వడ్ల సెంటర్లను ఓపెన్​ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ నెల 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు 140కి పైగా సెంటర్లను ఓపెన్​ చేయగా.. ఇంకా 48 సెంటర్లను ఓపెన్​ చేయాల్సి ఉంగా. ఈ సీజన్​లో 1.48 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని టార్గెట్​పెట్టుకోగా..  ఇప్పటివరకు ఐదు సెంటర్ల నుంచి 342 మెట్రిక్​ టన్నుల వడ్లను సేకరించారు. 

ప్రధానంగా పొలిటికల్​ లీడర్లు టైంకు సెంటర్లను ఓపెన్​ చేయడానికి రాకపోవడంతో.. తమ ప్రమేయం లేకుండా సెంటర్లను ఓపెన్​ చేయరాదని స్పష్టం చేస్తుండటంతో సెంటర్లు తెరవడానికి ఆలస్యం అవుతున్నట్లు తెలిసింది. సెంటర్లు ఆలస్యం అవుతుండటంతో అకాల వర్షాల కారణంగా వడ్లు తడిసిపోయి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఆరు వేల ఎకరాల్లో నష్టం

జిల్లాలోని చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట, కౌకుంట్ల, దేవరకద్ర, జడ్చర్ల, హన్వాడ, మహబూబ్​నగర్​ రూరల్​, కోయిల్​కొండ తదితర ప్రాంతాల్లో రైతులు వరి కోతలు పూర్తి చేశారు. నవాబ్​పేట, బాలానగర్​ వంటి ప్రాంతాల్లో పంటలు చివరి దశలో ఉన్నాయి. కోతలు పూర్తయిన చోట్ల వర్షాలకు ఆరబెట్టిన వడ్లు తడిసిపోతున్నాయి. చివరి దశలో ఉన్న వరి చేలు వర్షాలకు నేలకొరిగిపోతున్నాయి. మరికొన్ని చోట్ల వడగండ్లు, ఈదురు గాలులకు వరి కంకులకు ఉన్న వడ్లు రాలిపోతున్నాయి.గత నెల చివరి వారం నుంచి అకాల వర్షాలు పండటంతో ఆ డిపార్ట్​మెంట్ మండల అగ్రికల్చర్​ఆఫీసర్లను ఫీల్డ్​విజిట్​చేయించి, పంట నష్టం రిపోర్ట్​ ఉన్నతాధికారులకు అందజేశారు. 

మార్చి చివరి వారంలో కురిసిన వర్షాలకు 2,660 మంది రైతులకు చెందిన 2,799 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నిర్ధారించారు. ఈ పంటలు దాదాపు 33 శాతం డ్యామేజ్​ అయిన పంటలకు పరిహారం అందిస్తారు. నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు  దాదాపు 2,500 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు.  రెండు రోజుల నుంచి ఆయా మండలాల అగ్రికల్చర్​ ఆఫీసర్లు ఫీల్డ్​విజిట్​ చేసి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో పంట నష్టం వివరాల పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు. 

తక్కువ రేట్​కు కొంటున్న వ్యాపారులు

అకాల వర్షాల భయానికి రైతులు వడ్లను ప్రైవేట్​ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు వారిని మోసగిస్తున్నారు. పంటను అమ్ముకోవడానికి వస్తున్న వారికి వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర చెల్లించడం లేదు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు రూ.2,320 ఉండగా.. రూ.19 వేల నుంచి రూ.19,650 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. 

అకాల వర్షాలు ఆగంజేస్తున్నాయి

నాకు రెండు ఎకరాల పొలం. సన్నాలకు ప్రభుత్వం బోనస్​ ఇస్తుండంతో మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తం సన్నాల సాగు చేసిన. 13 ట్రాక్టర్ల వడ్లు వచ్చినయ్​. ప్రభుత్వం అందించే మద్దతు ధరతో పాటు బోనస్​ వస్తుందని ఎంతో ఆశ పడ్డ. కాని అకాల వర్షం మా ఆశలపై నీళ్లు చల్లింది. వర్షానికి వడ్లు తడుస్తున్నాయి. చేసేది లే రెండు రోజుల కిందట ప్రైవేట్​ వ్యాపారికి వడ్లు అమ్ముకున్నా. 

కొండాపురం వెంకటేశు, రైతు, అమ్మాపూర్ గ్రామం, మహబూబ్​నగర్​ జిల్లా

కాలం సహకరిస్త లేదు

నాకున్న 11 ఎకరాల్లో ఈ సీజన్​లో సన్న వడ్లు వేసిన. కోతలు పూర్తయ్యాయి. పంటను ఆరబెట్టి.. ప్రభుత్వ సెంటర్​లో అమ్ముదామనుకునే టైంలో  అకాల వర్షాలు పడుతున్నాయి. ఈ వాతావరణంలో వడ్లు ఎలా ఆరబెట్టుకోవాలి.  వడ్లను ఆరబెట్టలేక తప్పని పరిస్థితిలో క్వింటాల్​కు రూ.1,960 చొప్పున ప్రైవేటుకు అమ్ముకున్న.

సాలే అంజన్న, రైతు, కురుమూర్తి గ్రామం, మహబూబ్​నగర్​ జిల్లా