- వార్డుల వారీగా ఓటరు లిస్టు, బ్యాలెట్ పేపర్లు సిద్ధం
- రిజర్వేషన్ ఆధారంగా లిస్ట్ రెడీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశం
మహబూబ్‌నగర్, వెలుగు : సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడాది కావస్తోంది. త్వరలో ఎన్నికల నిర్వహణకు షెడ్యుల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు రాష్ర్ట ప్రభుత్వం కుల గణన సర్వే పూర్తి చేయడంతో ఇందుకు బలం చేకూరుస్తోంది. షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసర్ల బృందం ఏర్పాట్లను స్పీడప్ చేస్తోంది.
12 విభాగాలుగా విభజన..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్స్ మేనేజ్మెంట్, రవాణా, శిక్షణ, సామగ్రి మేనేజ్మెంట్, ఎంసీఎంసీ మేనేజ్మెంట్, ఎక్స్పెండీచర్ అకౌంట్స్, ఎక్స్పెండీచర్ మానిటరింగ్ మేనేజ్మెంట్, ఎన్నికల పరిశీలకులు, బ్యాలెట్ పేపర్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, హెల్ప్ లైన్ గ్రీవెన్స్, రిపోర్ట్స్ రిటన్స్ మేనేజ్మెంట్ అని 12 విభాగాలు పనిచేస్తాయి. ఒక్కొక్క విభాగానికో ఒక్కో జిల్లా ఆఫీసర్‌ను నియమించారు. ఇందులో డీపీవో, డీపీఆర్వో, డీటీవో, డీఈవో, డీఆర్డీవో తదితరులుఉన్నారు.
బ్యాలెట్ పేపర్ల ముద్రణకు టెండర్లు
జీపీ ఎలక్షన్లు బ్యాలెట్ పద్ధతిన నిర్వహించనుండటంతో ఆయా జిల్లాల్లో బ్యాలెట్ పేపర్లుముద్రణకు కలెక్టర్లు ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులకు టెండర్లుపిలవగా.. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే టెండర్లు పూర్తి అయి, ప్రింటింగ్ పూర్తి అయ్యింది. దీంతో ఆ జిల్లాల్లో ప్రస్తుతం బ్యాలెట్ పేపర్లను జీపీలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను ఏ జీపీలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో.. అన్ని బ్యాలెట్ పేపర్లకు సీరియల్ వైజ్‌గా నంబరింగ్ వేస్తున్నారు. ఈ నంబరింగ్ పూర్తి కాగానే.. పోలింగ్ స్టేషన్ల వారీగా బ్యాలెట్ పేపర్లను పంపిణీ
చేయనున్నారు.
మార్పులు.. చేర్పులు..
గతేడాది నంబరులో ఎలక్షన్ కమిషన్ పంచాయతీ ఓటర్ లిస్టును రిలీజ్ చేసింది. ఆ లిస్టును పంచాయతీ సిబ్బంది ఆయా జీపీ నోటీసు బోర్డుల వద్ద అతికించారు. అయితే మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో చాలా మంది తమ ఓటు ఎక్కడుందనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఓ వార్డులో నివాసం ఉండి మరో వార్డులో ఓటరు జాబితాలో పేరు వస్తే వాటికి సిబ్బంది సరి చేస్తున్నారు. ఇంటి పేర్లు, వయస్సు, తండ్రి పేర్లు తప్పుడగా పడితే, పంచాయతీ సిబ్బందికి చెప్పి వాటిని సరి చేయించుకుంటున్నారు. నోడల్ ఆఫీసర్లు కూడా గ్రామాలను విజిట్ చేస్తున్నారు. ఓటర్లు లిస్టు, పోలింగ్ స్టేషన్లను పరిశీలిస్తున్నారు.
రిజర్వేషన్ ఆధారంగా తీయాలని..
రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల కుల గణన సర్వే పూర్తి చేసింది. ఇప్పటికే జీపీలలో ఓటరు జాబితాను అతికించారు. పంచాయతీ సిబ్బంది వార్డుల వారీగా ఓటరు జాబితాను తీస్తున్నారు. అయితే రిజర్వేషన్ ఆధారంగా కూడా ఓటరు జాబితాను రెడీ చేయాలని పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రిజర్వేషన్ ఆధారంగా వార్డుల వారీగా లిస్టును తయారు ద్వారా ఆ పంచాయతీని ఏ కేటగిరీకి రిజర్వ్ చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.