అక్టోబర్ 14న పితృ దేవతలకు ఎందుకు తర్పణాలు వదలాలి.. దాని పురాణ కథ ఇదే..

అక్టోబర్ 14న పితృ దేవతలకు ఎందుకు తర్పణాలు వదలాలి.. దాని పురాణ కథ ఇదే..

మన అస్థిత్వానికి కారకులు మన తల్లితండ్రులు, వారి పూర్వులు. వారిని స్మరించుకోవడం, వారిపట్ల గౌరవాన్ని చూపించడం మన కర్తవ్యం. ప్రతి మానవుడూ తీర్చుకోవాల్సిన ఋణాలు మూడు ఉంటాయని పెద్దలు చెబుతారు. అవి దేవతల ఋణం, ఋషుల ఋణం. మన పూర్వీకులైన పితరుల ఋణం. వీటిలో పితృ ఋణాన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలం పితృపక్షం. దీనినే మహాలయ పక్షం అని కూడా ఉంటారు. భాద్రపద  అమావాస్య ( అక్టోబర్ 14)  పితృ తర్పణాలకూ, పిండ ప్రదానాలకూ విశిష్టమైనదని శాస్త్రవచనంగా పండితులు చెబుతున్నారు,   

మహలయ అమావాస్యను కొన్ని ప్రాంతాలలో సర్వ పితృ అమావాస్యగా జరుపుతారు. ఈ ఏడాది (2023) అక్టోబర్ 14 న మహాలయ అమావాస్య రానున్నది. మహాలయ  పక్షం రోజుల్లో పెద్దలకు తర్పణలు ఇవ్వటం కుదరని వారు అమావాస్య రోజు గతించిన పెద్దలకు తర్పణాలు విడిచి యధాశక్తి అన్నదానం వంటివి నిర్వహిస్తారు. మరి మహాలయ పక్షం ప్రత్యేకత ఏమిటి? పితృ ఋణం ఎందుకు తీర్చుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం కర్ణుడి కథలో దొరుకుతుంది.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యంగా  ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది కర్ణుడికి.

ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ...కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించిందని అశరీరవాణి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.  2023  సంవత్సరంలో మహాలయ అమావాస్య అక్టోబర్ 14 శనివారం నాడు వచ్చింది.  అందుకే ఆ రోజున పితృదేవతలు అందరూ భూమిపై సంచరిస్తారని గరుడ పురాణంలో  పేర్కొన్నారని పండితులు చెబుతున్నారు.  వారికి ఆ రోజు తర్పణాలు వదలి.. పిండ ప్రదానం చేస్తే  స్వర్గలోక ప్రాప్తి కలగడమే కాకుండా... పితృ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెబుతారు. 

భాద్రపదమాసంలోని బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని అంటారు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. అయితే అమావాస్య రోజు పితృదేవతలకు అందరికి  శ్రాద్ధం జరిపితే వారికి శాశ్వత స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని ఐతిహ్యం. వైదికం, తిథి, శ్రాద్ధం పేరుతో జరిపే పితృకార్యం ఇంట్లో కంటే నదీతీరంలో, సముద్ర తీరంలో జరపడం ముక్తిదాయకమని ప్రతీతి. వైదికంగా జరిపేవారు పుణ్యక్షేత్రాల్లో మహాలయ పక్షాలను నిర్వహిస్తుంటారు. 

సహజమైన మరణం సంభవించిన వారికి, ప్రమాదాలు, ఆత్మహత్యల కారణంగా మరణించిన వారికి వైదికం జరిపే తీరులో భేదం ఉంటుంది. అసహజంగా, ఆత్మహత్య కారణంగా విగతజీవులైన వారికి మహాలయ పక్షంలో శ్రాద్ధం జరుపుతారు. తండ్రి, తాత, తాత తండ్రి (ముత్తాత) లకు పితృ, పితామహ, ప్రపితామహ పేర్లతో వైదికంగా జరపగా ఆ పై వాళ్లకు అంటె అంతకు ముందు తరాలవారికి తిథులు ఉండవు. దీనితో వారిని స్మరిస్తూ కర్తలు పితృపక్షంలో ఒకరోజున వైదికం నిర్వహిస్తారు. తిథి సందర్భంగా కనీసం ఇద్దరు బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి భోజనం పెట్టి దక్షిణ చెల్లిస్తారు. హిరణ్యం (బంగారం) బదులు కొంత పైకాన్ని దక్షిణగా ఇస్తారు. వైదికంలో తర్పణ విధి ప్రధానమైనది. దీనికై కర్త మంత్రం చెబుతూ పితృదేవతలకు నల్ల నువ్వులు, నీరు అర్ఘ్యంగా వదులుతారు.

అయితే ఇంకొక సందేహం రావచ్చుమీకు ….

మేము ప్రతీ సంవత్సరం మామాతృదేవతలకు, పితృదేవతలకు ఆబ్దికములు నిర్వహిస్తామండి. మేము ఇంక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడుచేయాలా!! అనేప్రశ్నతలెత్తవచ్చు.. తప్పకుండాపెట్టాలి. ఎందుకంటే మీరు ఆబ్దికం పెట్టినపుడు తండ్రి, తాతగారు, ముత్తాతగారు మూడు తరాలు మాత్రమే వస్తారు. కానీ ఈమహాలయపక్షంలో తర్పణములు, ఆబ్దికములు పితృవంశములో వారందరికీ, అలాగే గురువర్యులకు, సన్నిహితులతో సహా అందరికిపెట్టవచ్చు. దీని వలన వంశస్థులు అందరు సంతృప్తిచెందుతారు. దీని వలన వంశాభివృద్ధి జరుగుతుంది. వివాహం ఆలస్యం అవ్వడం, సంతానపరమైన దోషములు తొలగుతాయి. గయలో శ్రాద్ధం నిర్వహించినంత ఫలితం సంప్రాప్తిస్తుందనిపెద్దల, పండితులనిర్వచనం.

అందు వలన ఈమహాలయపక్షంలో పితృ కార్యక్రమములు, తర్పణములు చేసుకుని అలా వీలుకాని వారు కనీసం పెద్దవాళ్ళ పేరుతో స్వయంపాకం అయినా ఇచ్చుకుని శక్తీమేరకు దానధర్మములు నిర్వహించి పితృదేవతలను సంతృప్తిపరచి వారి అనుగ్రహమునకు పాత్రులైపుత్ర, పాత్రాభివృద్ధులై సంతోషంగా జీవించండి.

ఎవరికి తర్పణాలు వదలాలి..

 

  • 1.  తండ్రి
  • 2.  తండ్రి తండ్రి
  • 3. తండ్రి తాత
  • 4. తల్లి
  • 5. సాపత్నయ మాతు: ( సవతి తల్లి)
  • 6. తల్లి అత్తగారు ( నాయునమ్మ)
  • 7. తల్లి అత్తగారి అత్తగారు
  • 8. తల్లి తండ్రి
  • 9. తల్లి తాత
  • 10 తల్లి తాత తండ్రి
  • 11.తల్లి తల్లి
  • 12.తల్లి నాయినమ్మ
  • 13. తల్లి నాయినమ్మ అత్తగారు
  • 14.మేనమామ
  • 15. మేనత్త
  • 16. మేనత్త భర్త
  • 17. సోదరి
  • 18. తల్లి చెల్లి
  • 19. గురువు
  • 20. జగద్గురువు ( ఆదిశంకరాచార్యులు)
  • 21. కంచి కామకోటి పీఠాధిపతులు ( చంద్రశేఖర సరస్వతి వారు)

గమనిక: పైన తెలిపిన వంశీకులలో మరణించిన వారికి మాత్రమే తర్పణాలు వదలాలి. మరొక విషయమేమిటంటే  తల్లి మరణించి ... తండ్రి జీవించి ఉన్నట్లయితే.. అలాంటి వారు తర్పణాలు వదలాలి అనుకుంటే ఒక్క తల్లికి మాత్రమే వదలాలి