మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ షిండే తో ..ఏపీ సీఎం చంద్రబాబు మంతనాలు

ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు. షిండే ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. చంద్రబాబు కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి ఏక్‌నాథ్ షిండే నివాసానికి వెళ్లారు.  మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రబాబుకు ఏక్​ నాథ్ షిండే స్వాగతం పలికారు. 

ALSO READ | సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు..

షిండే, ఆయన తనయుడు కల్యాణ్ లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్ షిండే, మరికొందరు శివసేన చీలికవర్గ నాయకులు చంద్రబాబును కలిశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో టీడీపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం భాగస్వామ్యపార్టీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఏక్‌నాథ్ షిండేతో సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.  సుదీర్ఘకాలం పాటు తమ ఈ రెండు రాష్ట్రాల మద్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, వాటిని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. చంద్రబాబుకు అపార రాజకీయ అనుభవం ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. చంద్రబాబు భేటీకి సంబంధించిన ఫోటోలను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు.