నామ్ కే వాస్తేగా ఎంజీ యూనివర్సిటీ

నామ్ కే వాస్తేగా ఎంజీ యూనివర్సిటీ
  • వర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ 
  • సగం మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లే
  • అకాడమిక్ కన్సల్టెంట్లతోనే టీచింగ్
  • ఆందోళనలో స్టూడెంట్స్​

నల్గొండ, వెలుగు : రాష్ట్రంలోని ప్రధాన వర్సిటీల్లో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఒకటి. ఈ వర్సిటీలో సరైన వసతులు లేకపోవడంతో నామ్​కే వాస్తేగా మారింది. నిధులు రాకపోవడం, స్టూడెంట్స్​కు క్లాసులు చెప్పేందుకు ఫ్యాకల్టీ లేకపోవడంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వర్సిటీని ఏర్పాటు చేసి పదిహేడేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, సిబ్బంది నియామకాల ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.  

18 కోర్సులు.. 2 వేల మంది స్టూడెంట్స్..

యూనివర్సిటీలో 18 కోర్సులు నిర్వహిస్తున్నారు. ఏటా 2 వేల మంది స్టూడెంట్స్ అడ్మిషన్లు తీసుకుంటారు. కానీ అందుకు సరిపడా ఫ్యాకల్టీ లేకపోవడంతో అకాడమిక్ కన్సల్టెంట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. వర్సిటీలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 70 పోస్టులు మంజూరు చేశారు. ఇందులో రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య కేవలం 35 ఉండగా, మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో కోర్సుకు కనీసం ఏడుగురు ఫ్యాకల్టీ అవసరం ఉండగా, ప్రస్తుతం ముగ్గురు, నలుగురితో కాలం వెళ్లదీస్తున్నారు. ఎమ్మెస్సీ జువాలజీ, ఫిజిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సోషల్ వర్క్స్ తదితర కోర్సులకు రెగ్యులర్ ప్రొఫెసర్లు లేక అకాడమిక్ కన్సల్టెంట్ల క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇంజినీరింగ్​లో అంతా ఖాళీయే..

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణ మరీ అధ్వానంగా మారింది. ఒక్కో బ్రాంచ్​లో కనీసం తొమ్మిది మంది అధ్యాపకులు పనిచేయాల్సి ఉండగా.. అన్ని బ్రాంచ్​లకు కలిపి 15 మంది మాత్రమే పనిచేస్తున్నారు. బోధనేతర సిబ్బంది వంద మందికి, కేవలం ఆరుగురు మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. బోధనేతర సిబ్బందిలో ప్రధానంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, జూనియర్ అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, ఎలక్ట్రిషియన్లు, అటెండర్లు, డ్రైవర్లను ప్రభుత్వం 
నియమించాల్సి ఉంది. 

ALSO READ : స్కూల్ లో బియ్యం అక్రమ తరలింపు చూసిన విద్యార్థికి టీసీ ఇచ్చి పంపిన హెచ్ఎం

అసలు డిపార్ట్​మెంట్లే లేవు..

యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ, బీఈడీ కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలను పర్యవేక్షించేందుకు వర్సిటీలో వాటికి సంబంధించిన డిపార్ట్​మెంట్లు ఉండాలి. అయితే వర్సిటీలో జువాలజీ, బాటనీ డిపార్ట్​మెంట్లను ఏర్పాటు చేయలేదు. ఆ సబ్జెక్టుల విషయంలో డిగ్రీ కాలేజీలకు ఎలాంటి సహకారం అందని పరిస్థితి నెలకొంది.

ఇక సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఎకనామిక్స్ డిపార్ట్​మెంట్ ఒక్కటే ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ డిపార్ట్​మెంట్లను ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30 బీఈడీ కాలేజీలు ఉండగా, వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్ కూడా లేదు.