- విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకే: విద్యాసంస్థల సెక్రటరీ సైదులు
హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని బీసీ గురుకుల విద్యార్థులకు అందించేందుకు కృషి చేస్తున్నామని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సోసైటీ సెక్రటరీ సైదులు వెల్లడించారు. గురువారం శామీర్ పేట దగ్గరలోని తుర్కపల్లి గురుకుల స్కూల్లో 2024 – టెక్ ఏరోస్ ఇన్నోవేషన్స్, రోబోటిక్స్ డ్రోన్స్ టెక్ ఎక్స్‌పోను ఆయన ప్రారంభించారు. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచుతూ వారికి అవసరమైన సాంకేతిక నైపుణ్యం అందించే లక్ష్యంతో ఈ ఎక్స్ పో నిర్వహిస్తున్నామని సైదులు చెప్పారు.
రోబోటిక్స్, డ్రోన్స్ ప్రాధాన్యత విద్యార్థులకు తెలుస్తుందని, రేపటి సైంటిస్టులుగా నేటి విద్యార్థులను తయారు చేసే లక్ష్యంతోనే స్టూడెంట్లకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. భవిష్యత్తులో రోబోటిక్స్ , డ్రోన్‌ల రంగాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతికతతో నడిచే పరిశ్రమల్లో కెరీర్ అవకాశాల గురించి పిల్లల్లో అవగాహన కల్పించడం ఈ ఎక్స్ పో ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తున్నామని, ఈ ప్రదర్శన స్టూడెంట్లకు కీలక ప్రయోజనాలను కలిగిస్తుందని సైదులు పేర్కొన్నారు.