కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? : పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? : పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​
  • బండి సంజయ్​కి పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సవాల్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న నిరాధార ఆరోపణలను పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్​​గౌడ్ తీవ్రంగా ఖండించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సంజయ్​కి సవాల్ విసిరారు. గాంధీ భవన్‌‌లో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వేల కోట్ల పన్నులు వెళ్తుంటే, రాష్ట్రానికి తిరిగి వచ్చే నిధులు "గుండు సున్నా" అని ఆయన ఫైర్​అయ్యారు. సన్నబియ్యం పంపిణీని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాసే ధైర్యం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం మోదీని అడిగే దమ్ము సంజయ్‌‌కు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ నిరుపేదలకు వరంగా మారిందని, దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. 

దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని మోదీకి సంజయ్ లేఖ రాయగలరా? అని నిలదీశారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సింది పోయి, అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ పనిచేస్తోందని, నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. సంజయ్ బీఆర్‌‌ఎస్‌‌తో అనైతిక పొత్తు కుదుర్చుకొని కాంగ్రెస్‌‌పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణ (ఆర్కే) రాసిన వ్యాసంలో కాంగ్రెస్ నేత రాహుల్ పై చేసిన వ్యాఖ్యలను మహేశ్​గౌడ్ ఖండించారు.  ‘అది ఆర్కే పలుకు కాదని.. మోదీ పలుకు’ అని విమర్శించారు.