అల్లు అర్జున్​ అరెస్ట్​పై బీజేపీ, బీఆర్ఎస్​ మతిలేని విమర్శలు ​: మహేశ్​కుమార్​ గౌడ్​

అల్లు అర్జున్​ అరెస్ట్​పై బీజేపీ, బీఆర్ఎస్​ మతిలేని విమర్శలు ​: మహేశ్​కుమార్​ గౌడ్​
  • కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే టాలీవుడ్​ డెవలప్​: మహేశ్​కుమార్​ గౌడ్​ 

నిజామాబాద్​, వెలుగు: పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ సరైన మార్గదర్శకాలు పాటించకుండా సంధ్య థియేటర్​కు వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని, ఓ మహిళ మృతి చెందిందని  పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో పదేండ్ల బాలుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ పొందుతున్న అంశాన్ని పట్టించుకోకుండా బీజేపీ, బీఆర్ఎస్​ లీడర్లు అల్లు అర్జున్​అరెస్ట్​పై స్పందించిన తీరు ఘోరమన్నారు. ఆదివారం మహేశ్​కుమార్​గౌడ్​ నిజామాబాద్​ అర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​లో మీడియాతో మాట్లాడారు.  

సినిమా రంగాన్ని ప్రోత్సహించే విషయంలో కాంగ్రెస్​ ఎప్పుడూ ముందుందని తెలిపారు. మద్రాస్​ కేంద్రంగా పనిచేసిన తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్​ షిఫ్ట్​ కావడానికి  కాంగ్రెస్​ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కర్​రెడ్డి సహా వైఎస్​రాజశేఖర్​రెడ్డికి వరకు అందరూ కారకులని పేర్కొన్నారు. తక్కువ రేట్​కే ల్యాండ్​ ఇచ్చి అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోలు నిర్మించేలా ప్రోత్సహించారని చెప్పారు. ఆ టైమ్​లో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 

జైలుకెళ్లి వస్తే పరామర్శలా?

సినిమా థియేటర్​కు వెళ్లి తొక్కిసలాటకు కారకుడైన అల్లు అర్జున్​ 8 గంటలు జైళ్లో ఉంటే బీజేపీ, బీఆర్ఎస్​ లీడర్లు గగ్గోలుపెడుతూ ఆయనను పరామర్శించారని తెలిపారు. మరణించిన మహిళపై, హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ పొందుతున్న ఆమె కొడుకుపై కించిత్తు సానుభూతి లేని లీడర్లు కాంగ్రెస్​ను లక్ష్యం చేసుకొని, విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.

అన్ని రంగాల డెవలప్​మెంట్​ కోరుకునే తమ సర్కారు అందులో  సినిమా రంగం అభివృద్ధిని  చిత్తశుద్ధితో కోరుకుంటున్నదని తెలిపారు. ఆ దృష్టితోనే మినహాయింపులు ఇచ్చి మరీ కమర్షియల్​ సినిమా అయిన పుష్ప2కు టికెట్​రేట్లు పెంచుకునే అవకాశాన్ని మంత్రి కోమటి​రెడ్డి వెంకట్​రెడ్డి కల్పించారన్నారు.