యూఎస్​ బ్యాంకులకు డౌన్​గ్రేడ్​ ముప్పు

యూఎస్​ బ్యాంకులకు డౌన్​గ్రేడ్​ ముప్పు

న్యూఢిల్లీ: యూఎస్​ సావరిన్​ రేటింగ్​ను తగ్గిస్తున్నామంటూ ఫిచ్​ప్రకటించిన కొన్ని రోజులలోనే మరో రేటింగ్​ ఏజన్సీ మూడీస్​ ఆ దేశంలోని కొన్ని  బ్యాంకుల క్రెడిట్​ రేటింగ్​ను తగ్గించేసింది. దేశంలోని  బడా బ్యాంకుల స్టేటస్​ను రివ్యూ చేస్తున్నట్లు వార్నింగ్​ ఇచ్చింది. పది బ్యాంకుల రేటింగ్​కు కోత పెట్టగా, కొన్ని పెద్ద బ్యాంకులపై రివ్యూ నిర్వహస్తున్నామని, డౌన్​గ్రేడ్​ ముప్పు పొంచి ఉందని మూడీస్​ వెల్లడించింది. ఎం అండ్​ టీ బ్యాంక్​, పినకిల్​ ఫైనాన్షియల్​ పార్ట్​నర్స్​, ప్రాస్పెరిటీ బ్యాంక్​, బీఓకే ఫైనాన్షియల్​కార్ప్​ వంటివి డౌన్​గ్రేడ్​ చేసిన జాబితాలో ఉన్నాయి. బీఎన్​వై మెలన్​, యూఎస్​ బ్యాంకార్ప్​, స్టేట్​ స్ట్రీట్​, ట్రూయిస్ట్​ ఫైనాన్షియల్​ వంటి బ్యాంకులపై రివ్యూ జరుగుతున్నట్లు మూడీస్​ తెలిపింది. 

చాలా బ్యాంకులు రెండో క్వార్టర్లో లాభాలపై వత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫైనాన్షియల్​ రిజల్ట్స్​ ద్వారా ఇది వెల్లడవుతోందని, అంతర్గతంగా క్యాపిటల్​ను జనరేట్​ చేసుకునే సామర్ధ్యం తగ్గుతోందని తెలుస్తోందని మూడీస్​ తన నోట్​లో వివరించింది. వడ్డీ రేట్లు, అసెట్స్​ అండ్​ లయబిలిటీస్​ మేనేజ్​మెంట్లో యూఎస్​ బ్యాంకులు కొంత రిస్క్​ఎదుర్కొంటున్నాయని మూడీస్​ పేర్కొంది. 

ఈ ఏడాది మొదట్లో అమెరికాలోని సిలికాన్​ వ్యాలీ బ్యాంక్​, సిగ్నేచర్​ బ్యాంకులు కుప్పకూలాయి. దాంతో అమెరికాలోని బ్యాంకింగ్​ రంగంపై విశ్వాసం సన్నగిల్లింది. ఫలితంగా చాలా రీజినల్​ బ్యాంకులు డిపాజిట్ల వాపసు సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది కూడా. బ్యాంకింగ్​ సిస్టమ్​పై నమ్మకం పెంచడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేసినా, అవి పూర్తిగా ఫలితం ఇవ్వలేదు. క్యాపిటల్​ వన్​, సిటిజెన్స్​ ఫైనాన్షియల్​, ఫిఫ్త్​ థర్డ్​ బ్యాంకార్ప్​వంటి వాటి అవుట్​లుక్​ను స్టేబుల్​ నుంచి నెగటివ్​కు మూడీస్​ ఏజన్సీ మార్చింది.