మార్కెట్ ముందు నుంచి ఊహించిందే జరిగింది. వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ మానెటరీ పాలసీలో నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 7) ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా వడ్డీరేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటన చేశారు.
‘‘వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని మానెటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. దీంతో వడ్డీ రేట్లు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గనున్నాయి’’ అని ప్రకటించారు. గత ఐదేళ్లుగా రెపో రేట్లు తగ్గించడం ఇదే మొదటి సారి. చివరిగా 2020-మేలో వడ్డీ రేట్లు 4 శాతానికి చేరుకునేలా తగ్గించారు. ఆ తర్వాత వరుసగా 7 సార్లు పెంచుతూ 6.5 శాతానికి తీసుకొచ్చింది ఆర్బీఐ. తాజా కట్ తో 6.25 శాతానికి చేరుకున్నాయి వడ్డీ రేట్లు.
రెపో రేట్లు అంటే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్లు.
ఇండియా జీడీపీ గ్రోత్ 2025-26 సంవత్సరానికి 6.7 శాతం ఉండనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
క్వార్టర్ 1 (మొదటి త్రైమాసికం) Q1 : 6.7%
క్వార్టర్2 Q2: 7%
క్వార్టర్3 Q3: 6.5%
క్వార్టర్4 Q4: 6.5%
అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం (ఇన్ ఫ్లేషన్) 4.8 శాతం ఉండనుందని ప్రకటించారు.
రెపో రేట్లు తగ్గడం వలన బ్యాంకులకు తక్కువ వడ్డీకే ఆర్బీఐ నుంచి రుణాలు(లోన్లు) అందుతాయి. దీంతో బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే లోన్లపైన వడ్డీలు తగ్గించనున్నాయి. పర్సనల్ లోన్లు, హోమ్, వెహికిల్ లోన్లపై వడ్డీలు తగ్గనున్నాయి. దీంతో ప్రజల వినియోగం పెరగడం, కొనుగోలు శక్తి పెరగడం, పెట్టుబడి పెరగడం జరుగుతుంది. ఇది ఎకానమీని బూస్ట్ చేస్తుంది.
ఆర్బీఐ రేట్ కట్స్ ద్వారా బ్యాంకులకు తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తుంది ఆర్బీఐ. దీంతో కస్టమర్లపై వడ్డీ భారాన్ని తగ్గిస్తాయి బ్యాంకులు. ఇప్పటి వరకు ఉన్న నెలవారీ ఈఎమ్ఐ లు కాస్త తగ్గుతాయి. దీంతో కామన్ మ్యాన్ కు ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.