గాంధీ భవన్ ఎదుట మాల మహానాడు ఆందోళన .. ఎస్సీ వర్గీకరణ చేయవద్దంటూ పీసీసీ చీఫ్​కు వినతి

గాంధీ భవన్ ఎదుట  మాల మహానాడు ఆందోళన .. ఎస్సీ వర్గీకరణ చేయవద్దంటూ పీసీసీ చీఫ్​కు వినతి

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చేయవద్దంటూ, దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని విరమించుకోవాలని మాలమహానాడు నాయకులు మంగళవారం గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. వర్గీకరణ చేస్తే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్గీకరణ వద్దురా.. కలిసుంటే ముద్దురా.. అని నినాదాలు చేస్తూ తమ నిసనను కొనసాగించారు. పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు తరలివచ్చిన మాలలు తమ  ఆందోళన తర్వాత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.

ఎస్సీ వర్గీకరణ చేయవద్దని, దీనికోసం కాంగ్రెస్ తరఫున తమకు మద్దతు ఇవ్వాలని వారు మహేశ్ కుమార్ గౌడ్‌‌ ను అభ్యర్థించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, మల్లిఖార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఆందోళనలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కో కన్వీనర్లు చెరుకు రాంచందర్, రాజు ఉస్తాద్, జి.చెన్నయ్య, బేర బాలకిషన్, నల్లాల కనకరాజు, కరణం కిషన్, మంత్రి నర్సింహ, మేక వెంకన్న, బూర్గుల వెంకటేశ్వర్లు, జంగా శ్రీనివాస్, గోపోజు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.