
దోమలు విజృంభించాయంటే చాలు జనాలు మంచం పడుతున్నారు. దోమకాటు వల్ల విష జ్వరాలు ప్రబలుతాయి.. మలేరియా లాంటి మహమ్మారి వచ్చిదంటే చలి.. జ్వరం వేధిస్తాయి. దోమలు రక్తంలో కలిసి ఎర్రరక్తకణాలను నాశనం చేస్తాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా వ్యాధినుంచి జనాలు ఎలా రక్షణ పొందాలి.. ఎలాంటి చర్యలు పాటించాలో అవగాహన కల్పిస్తోంది. 2007 నుంచి ఏప్రిల్ 25 న మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజు ( ఏప్రిల్ 25) మలేరియా డే సందర్భంగా ప్రత్యేక కథనం. . .
ప్రపంచంలో ఏటా లక్షలాది మంది మలేరియా బారిన పడుతున్నారు. ఎంతోమంది చనిపోతున్నారు. దోమల నివారణ ద్వారానే మలేరియా అరికట్టవచ్చు. అందుకే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని 2007 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న మలేరియా నివారణ దినోత్సవం నిర్వహిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
ఎంతో సైన్స్ పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో కూడా మలేరియా వల్ల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అసలు ఏ మందులు లేని కాలంలో అయితే లక్షలాది మంది ప్రాణాలు పోయాయి. నిజాం కాలంలో ఈ వ్యాధి వల్ల అనేక మంది చనిపోయారు. ఎందుకు చనిపోతున్నారో తెలియదు. అది ఏం వ్యాధో కూడా తెలియదు. ప్రజలు దాన్ని 'గత్తర', 'మహమ్మారి' అని పిలిచేవాళ్లు.. ఒక గ్రామంలో గత్తర వచ్చిందంటే చుట్టు పక్కల గ్రామాలకు కూడా వ్యాపించేది. వందల మంది ప్రాణాలు పోయేవి. అప్పుడే... బ్రిటీష్ వాళ్లు నియమించిన వైద్యుడు రోనాల్డ్ రాస్ హైదరాబాద్ కు వచ్చాడు.
ఈ వ్యాధి మూలాలను కనుక్కోవాలని అనేక పరిశోధనలు చేశాడు. రోగుల రక్తనమూనాలను సేకరించి పరిశీలించాడు. చివరగా 1889 ఆగష్టు 20న మలేరియా ఎలా వస్తుంది? దానికి కారణయ్యే ప్రొటోజోవా పరిణామ క్రమం కనుగొన్నాడు. అందుకుగాను ఆయనకు 1902లో నోబెల్ బహుమతి వచ్చింది.
ఎలా వస్తుంది?
దోమల వల్ల మనిషి ఎన్నో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దోమలు మురికి నీళ్లలో చెత్తా చెదారాల్లో వృద్ధి చెందడమే కాకుండా నిల్వ ఉన్న పరిశుభ్రమైన నీటి మీద కూడా గుడ్లు పెడుతుంటాయి. దోమల నుంచి రక్షించుకోవడం మనిషికి ఒక సవాల్. వీటి ద్వారా వ్యాపించే వ్యాధుల్లో ప్రధానమైనది మలేరియా ఎనాఫిలిస్ అనే ఆడ దోమ ద్వారా మలేరియాను వ్యాప్తి చేసే సూక్ష్మజీవులు శరీరంలోకి చేరతాయి.
ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది దోమ లాలాజల గ్రంథుల్లో ఉంటుంది. అది మనిషిని కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత రక్తంలోకి చేరుతుంది. ఇవి కాలేయంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందుతాయి. అసంఖ్యాకంగా వృద్ధి చెందిన తర్వాత అక్కడి నుంచి తిరిగి రక్తంలోకి ప్రవేశించి ఎర్రరక్త కణాలను నాశనం చేయడం మొదలు పెడతాయి. అవి కాలేయంలో ఉన్నప్పుడు మలేరియా తాలూకు లక్షణాలు కనిపించవు. కానీ ఎర్ర రక్తకణాలను నాశనం చేయడం మొదలు పెట్టాక మాత్రం విపరీతమైన జ్వరం, చలి మొదలవుతాయి. మలేరియాతో బాధపడుతున్న వ్యక్తి రక్తాన్ని ఆడ దోమ పీల్చుకుని ఆరోగ్యవంతులను కుడితే వాళ్లకీ మలేరియా సోకుతుంది.
లక్షణాలు
ప్లాస్మోడియం కాలేయం నుంచి రక్తంలోకి ప్రవేశించాక రక్తనాళాలు చిట్లడం మొదలవుతాయి. సరిగ్గా అదే సమయంలో రోగికి 103 నుంచి 104 ఫారెన్హీట్ డిగ్రీల జ్వరం ఉంటుంది. తలనొప్పి, వాంతులు మొదలవుతాయి. రోగి చలి తట్టుకోలేక దుప్పటి మీద దుప్పటి కప్పుకుంటాడు.. జ్వరం గరిష్ట స్థాయికి చేరుకున్నాక మాత్రమే అతడిలో చలి తగ్గుతుంది. కొన్ని గంటల తర్వాత టెంపరేచర్ మళ్లీ మామూలు స్థితికి వచ్చి చెమటలు పట్టడం మొదలవుతుంది. బలహీనంగా మారతాడు.
మందులు వాడితే జ్వరం తగ్గుతుంది. కానీ.. ఒకటి నుంచి మూడు రోజుల్లో మళ్లీ చలి జ్వరం వస్తుంది. ఈ వ్యాధి మరో ముఖ్య లక్షణం ఏంటంటే రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి చలి జ్వరం వస్తుంది. కాలేయం నుంచి ప్లాస్మోడియం రక్తంలోకి ప్రవేశిస్తున్నప్పుడల్లా ఇలా జరుగుతుంది. మలేరియా జ్వరం మాటిమాటికీ వచ్చిందంటే.. ఎర్ర రక్త కణాలు బాగా క్షీణించి రోగి రక్తహీనతకు గురైనట్లు గుర్తించాలి. ఇలా జరిగినప్పుడు రోగి కాలేయం, ప్లీహం వాస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వ్యాధి సోకిన వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించాలి. వైద్య పరీక్షలు చేయించాలి.
- పట్టణాల్లో గ్రామాల్లో పారిశుద్ధ్యం లేపించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.
- మురుగు కాలువలు వీధులను శుభ్రంగా ఉంచాలి.
- అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాల్లో దేమల మందులను స్ప్రే చేసి దోమలను నాశనం చేయాలి.
- దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- పూల కుండీల్లో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.
- ఇంట్లో ఉండే నీటి పాత్రల మీద మూతలు గట్టిగా బిగించి ఉంచాలి.
- నల్లా నీళ్లు పట్టే ప్రతిసారీ ట్యాంకులను శుభ్రం చేయాలి..
- ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి