మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణంపై నీలి నీడలు!

 మల్లమ్మకుంట రిజర్వాయర్  నిర్మాణంపై నీలి నీడలు!
  • భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరణ
  • సర్వేను అడ్డుకుంటున్న నిర్వాసితులు
  • ప్రశ్నార్థకంగా ఆర్డీఎస్  ఆయకట్టు

గద్వాల, వెలుగు: మల్లమ్మకుంట రిజర్వాయర్  నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. రిజర్వాయర్  నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో పనులు ముందుకు పడడం లేదు. మార్కింగ్  (భూమి హద్దులు) చేసేందుకు వెళ్లిన ఆఫీసర్లను ఇప్పటివరకు మూడు సార్లు అడ్డుకున్నారు. దీంతో ఆర్డీఎస్  రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఆర్డీఎస్  చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 2017లో రూ.783 కోట్లతో తుమ్మిళ్ల లిఫ్ట్  పనులు స్టార్ట్  చేసింది.

 కానీ, రిజర్వాయర్ల నిర్మాణం మాత్రం చేపట్టలేదు. తుమ్మిళ్ల లిఫ్ట్  ఇరిగేషన్ లో భాగంగా మల్లమ్మ కుంట రిజర్వాయర్  నిర్మించాలని ఎన్నికల ముందు బీఆర్ఎస్​ సర్కారు జీవో విడుదల చేసింది. అప్పటినుంచి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. భూములు కోల్పోతున్న రైతులు మల్లమ్మ కుంట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.

568 ఎకరాలు అవసరం..

మల్లమ్మకుంట రిజర్వాయర్  నిర్మించాలంటే 568 ఎకరాలు అవసరమని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో కొంత ప్రభుత్వ భూమి ఉండగా, మిగిలినదంతా రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. మల్లమ్మ కుంట రిజర్వాయర్  కోసం రూ.45 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. భూమికి భూమి కావాలని రైతులు డిమాండ్  చేస్తున్నారు. లేదంటే తమకు ఈ రిజర్వాయర్  వద్దంటున్నారు. దీంతో ఆఫీసర్లు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

గత సర్కారు నిర్లక్ష్యం..

తుమ్మిళ్ల లిఫ్ట్ ను గత ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చేసింది. ఆర్డీఎస్  పరిధిలోని 40వ డిస్ట్రిబ్యూటర్  చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలనే లక్ష్యంతో 2017లో తుంగభద్ర నదిపై రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద లిఫ్ట్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో రూ.162 కోట్లతో పంప్ హౌస్  నిర్మాణం చేపట్టేందుకు జీవో  428 జారీ చేసింది. అప్పట్లో వేరే ప్రాజెక్టుకు వాడిన పాత పైపులు, మోటార్లను తీసుకువచ్చి హడావుడిగా ఒక పంపును ఏర్పాటు చేసి 2018లో దాని స్టార్ట్  చేశారు. మళ్లీ ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. ఆర్డీఎస్  చివరి ఆయకట్టుకు నీరందించేందుకు రెండు పంప్ లు, మల్లమ్మ కుంట, జూలకల్, వల్లూరు గ్రామాల దగ్గర మూడు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు.

 కానీ, హడావుడిగా ఒక పంప్​ను కంప్లీట్  చేసి రిజర్వాయర్ల నిర్మాణం చేయకుండానే ఆర్డీఎస్  కాలువలోకి పంపింగ్  చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటివరకు మూడు రిజర్వాయర్లకు సంబంధించి భూసేకరణ చేయకపోవడం, రెండో పంప్ ను కంప్లీట్  చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు రాని పరిస్థితి నెలకొంది. గతంలోనే భూ సేకరణ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్​లో మూడు రిజర్వాయర్లు కట్టాల్సి ఉండగా, మల్లమ్మకుంటకు మాత్రమే గత ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వాస్తవంగా మల్లమ్మ కుంటతో పాటు జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లను కూడా నిర్మించాల్సి ఉంది. కానీ, మల్లమ్మ కుంట రిజర్వాయర్ కు మాత్రమే జీవో ఇచ్చి మిగతా రెండింటికి జీవో ఇవ్వలేదు.

పెరిగిన ఎస్టిమేషన్లు..

2017లో తుమ్మిళ్ల లిఫ్ట్ తో పాటు మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.783 కోట్లు అవసరం ఉంటుందని ఎస్టిమేషన్లు వేశారు. ప్రస్తుతం మల్లన్నకుంట రిజర్వాయర్  నిర్మాణానికి రూ.520 కోట్లు ఖర్చవుతుందని ఆఫీసర్లు ఎస్టిమేషన్లు వేశారు. ఈ రిజర్వాయర్  నిర్మాణానికి 568 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పంప్  హౌస్  నిర్మాణం చేపట్టినప్పటి నుంచి అన్ని పనులు చేసి ఉంటే రూ.783 కోట్లలోనే పంపింగ్  పనులతో పాటు మూడు రిజర్వాయర్లు కంప్లీట్  అయ్యేవని నిపుణులు చెబుతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని చెబుతున్నారు.

రైతులు సహకరించడం లేదు..

రిజర్వాయర్  కోసం సేకరించే భూములకు మార్కింగ్  వేసేందుకు వెళ్తే రైతులు అడ్డుకుంటున్నారు. రిజర్వాయర్  నిర్మాణానికి రైతులు సహకరించడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. విజయ భాస్కర్ రెడ్డి, ఈఈ, ఆర్డీఎస్