కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు మల్లన్న కోనేరులో స్నానం చేసి గొల్ల కేతమ్మ, బలిజ మెడలమ్మతో కొలువైన మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలను తయారు చేసి కొండపై కొలువైన ఎల్లమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఎస్ఐ రాజు, సిబ్బందితో కలిసి టెంపుల్ ఆవరణలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు.