ఐలోని ఒగ్గుడోలు మోగింది.. మల్లన్న జాతరకు ఐనవోలు ముస్తాబు

  • రేపటి నుంచి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • పారిశుధ్య పనుల కోసం 450 మందికి విధులు
  • సిద్ధమైన ఎండోమెంట్, హెల్త్, పోలీస్, ఆర్టీసీ, ఇతర శాఖలు


హనుమకొండ/ వర్ధన్నపేట, వెలుగు: ఐలోని ఒగ్గుడోలు మోగింది.. బ్రహ్మోత్సవాలకు వేళైంది. సోమవారం భోగి పండుగ నుంచి ఐలోని మల్లికార్జునస్వామి జాతర ప్రారంభం కానుండగా, ఈ మూడు రోజుల్లోనే రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి దాదాపు 10 లక్షల మంది వరకు భక్తులు తరలివస్తారని అధికారుల అంచనా. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంపై అధికారులు ఫోకస్​ పెట్టారు. శానిటేషన్, తాగునీరు, టాయిలెట్స్​ విషయంలో సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ట్రస్ట్​ బోర్డు నియామకంపై వివాదం నడుస్తుండటంతో జాతర కమిటీ వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

డ్రింకింగ్​ వాటర్​, టాయిలెట్స్..

ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు భోగి, మకర సంక్రాంతి, కనుమ రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దీంతో ధర్మ దర్శనంతోపాటు స్పెషల్​ దర్శనాలకు సంబంధించిన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి క్యూలైన్ల సమీపంలోనే డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్​ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. 

జాతర సమయంలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా మెయిన్​ జంక్షన్ల వద్ద మిషన్​ భగీరథ నీటితో 50 ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. గుడి చుట్టూ మరో ఐదు టెంపరరీ ట్యాంకులు కూడా పెడుతున్నారు. మరో 15 ట్రాక్టర్​ ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. జాతర ఆవరణలో ఇప్పటికే 70 వరకు టాయిలెట్స్ అందుబాటులో ఉండగా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​కు చెందిన 2 మొబైల్​ బస్​టాయిలెట్స్, మరో 50 టెంపరరీ టాయిలెట్స్​పెట్టారు.

శానిటేషన్​కే 450 మంది సిబ్బంది..

జాతరలో పారిశుధ్య నిర్వహణ సవాల్​గా మారుతోంది. దీంతో ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలు, చెత్తను తరలించడం, బ్లీచింగ్​ పౌడర్​ చల్లడం తదితర శానిటేషన్​ పనులకు దాదాపు 450 మంది సిబ్బందికి విధులు అప్పగించారు. ఇందులో జీడబ్ల్యూఎంసీ నుంచి 200 మంది ఉండగా, వివిధ పంచాయతీల నుంచి మరో 250 మంది వరకు ఉంటారని అధికారులు చెబుతున్నారు. 

Also Read :- తెలంగాణలోకి కొత్త బ్రాండ్ బీర్లు, లిక్కర్

విద్యుత్తు శాఖ నుంచి 30 మంది, రెవెన్యూ 25 మంది, చైల్డ్​ వెల్ఫేర్  60, మిషన్​ భగీరథ 45 మంది ఇలా వివిధ డిపార్ట్​మెంట్లు కలిపి సుమారు 600 మందికిపైగా ప్రభుత్వ అధికారులు జాతరలో విధులు నిర్వర్తించనున్నారు. వైద్య సేవల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.

200 సీసీ కెమెరాలతో నిఘా.. 

ఐలోని మల్లన్న జాతర కోసం ఆర్టీసీ రెడీ అయ్యింది. హనుమకొండ, వరంగల్ నుంచి మొత్తంగా 50 బస్సులు నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని బట్టి బస్సులు నడిపిస్తామని ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం విజయభాను తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 

ఇప్పటికే దేవాదాయశాఖ తరఫున 72, పోలీస్ డిపార్ట్మెంట్​ తరఫున 48 పర్మినెంట్​ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, టెంపరరీగా మరో 80 కెమెరాలు బిగిస్తున్నారు. దాదాపు 200 మంది పోలీస్​ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు.  స్థానికంగా ఉన్న షాపుల వద్ద ధరల నియంత్రణపైనా ఫోకస్​ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

టెంపరరీ కమిటీ ఏర్పాటు

ఐనవోలు మల్లికార్జునస్వామి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్ల పర్యవేక్షణలో ఆలయ కమిటీ పాత్ర కీలకం. కానీ ట్రస్ట్​ బోర్డు నియామకంపై కోర్టులో కేసు నడుస్తుండగా, రెండు రోజుల కిందట దేవాదాయశాఖ 14 మంది సభ్యులతో జాతర కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జాతర కమిటీ కొనసాగుతుంది. 

భక్తులకు ఇబ్బందులు కలగనియ్యం..

ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. వృద్ధులు, వికలాంగులకు వీఐపీ లైన్ లో దర్శనానికి వెసులుబాటు కల్పిస్తాం. జాతరలో అధిక ధరలు వసూలు చేసే వారి టెండర్​ రద్దు చేసి సీరియస్​ యాక్షన్​ తీసుకుంటాం. జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం.- అద్దంకి నాగేశ్వరరావు, ఈవో, ఐనవోలు