ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో అన్నం వండలేదని ఓ భర్త, భార్యను కొట్టి చంపాడు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మే 7న రాత్రి జమన్కిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నుధి గ్రామంలో జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని 40 ఏళ్ల సనాతన్ ధరువాగా గుర్తించిన అధికారులు.. చనిపోయిన అతని భార్య 35 ఏళ్ల పుష్పా ధరువాగా కనుగొన్నారు.
సనాతన్, పుష్పకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరి కుమార్తె కూచిందలో ఇంటి పని చేస్తుండగా, కుమారుడు మే 7న రాత్రి అతని స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో సనాతన్ ఇంటికి తిరిగి రాగా.. పుష్ప కేవలం కూర మాత్రమే వండిందని, కానీ అన్నం వండలేదని గ్రహించిన అతను.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇది వారి మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఆ తర్వాత అతను కోపంతో తన భార్యపై దాడి చేశాడు. అంతేకాదు ఆమెను కొట్టి చంపాడు.
ఘటన జరిగిన తర్వాత కుమారుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా తల్లి శవమై ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, భర్తను అదుపులోకి తీసుకున్నారు. మే8న శవపరీక్ష నిర్వహించి నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నట్లు జమన్కిరా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌జిత్ దాస్ తెలిపారు.