
- ఇంకా పూర్తికాని పనులు
- కొన్నిచోట్ల మొదలు కూడా పెట్టలే
మెదక్, వెలుగు: మన ఊరు– మన బడి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. స్కూల్స్ రీ ఓపెనింగ్‌కు మరో ఆరు రోజులు మాత్రమే ఉన్నా.. ఎక్కడి పనులు అక్కడే దర్శనం ఇస్తున్నాయి. అకడమిక్ ఇయర్ ప్రారంభంలోగా పనులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, స్థలాల సమస్య, అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్షం తదితర కారణాలతో అనేక స్కూళ్లలో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పలుచోట్ల రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా స్టూడెంట్స్ ఇబ్బందుల మధ్యే చదువు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఫస్ట్ ఫేజ్‌లో 313 స్కూళ్లు ఎంపిక
మెదక్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్‌లో 313 స్కూల్స్ సెలెక్ట్ చేశారు. ఈ స్కూళ్లలో బిల్డింగ్ రిపేర్స్, కిచెన్ షెడ్స్, డైనింగ్ హాల్స్, కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ వంటి పనులు చేపట్టేందుకు గాను రూ.131 కోట్లు మంజూరు అయ్యాయి. కొన్ని పనులను ఈజీఎస్ కింద చేపట్టారు. ప్రభుత్వం జూన్12లోగా పనులు కంప్లీట్ చేసి అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు కలెక్టర్ పలుమార్లు మీటింగ్‌లు పెట్టడంతో పాటు, ఫీల్డ్ విజిట్ చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. గడువు సమీపించినా అనేక చోట్ల పనులు పూర్తి కాలేదు.
మండలాల వారీగా..
నిజాంపేట మండలంలో ఏడు స్కూళ్లు ఎంపిక అయ్యాయి. నిజాంపేట హైస్కూల్ లో ఎలక్ట్రిషన్ వర్క్స్, సంపు, డైనింగ్ హల్, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.20 లక్షల ఫండ్ శాంక్షన్ కాగా ఒక ఎలక్ట్రిషన్ వర్క్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. నిజాంపేట ఎంపీపీఎస్ స్కూల్‌కు సంపు, కాంపౌండ్ వాల్, మేజర్ అండ్ మైనర్ వర్క్స్, ఎలక్ట్రికల్, టాయ్ లెట్స్, ఐదు క్లాస్ రూమ్‌ల నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు అయ్యాయి. కానీ ఒక్క పని కూడా స్టార్ట్ కాలేదు. చల్మెడ ప్రైమరీ స్కూల్ కు రూ.8 లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.23 లక్షలు శాంక్షన్ అయ్యాయి. సంపు, ఎలక్ట్రిషన్ వర్క్స్, మేజర్ అండ్ మైనర్ వర్క్స్ పూర్తయ్యాయి. రూ.10 లక్షల వరకు బిల్లులు రాకపోవడంతో పనులు మధ్యలో ఆగిపోయాయి.
శివ్వంపేట మండలంలోని వివిధ స్కూళ్లలో 26 పనులకు రూ.4.42 కోట్లు మంజూరు అయ్యాయి. అందులో 4 చోట్ల మాత్రమే పనులు కంప్లీట్ అయ్యాయి. 10 చోట్ల పెయింటింగ్ పనులు పెండింగ్ ఉన్నాయి.. ఫర్నిచర్ అవసరం ఉంది. ఇంకా 8 చోట్ల వర్స్క్ నడుస్తున్నాయి.
రేగోడు మండలంలో 29 స్కూల్స్ ఉండగా 9 స్కూల్స్ సెలెక్ట్ అయ్యాయి. కాగా ఇప్పటివరకు రేగోడ్ క్లస్టర్ మర్పల్లి ప్రైమరీ స్కూల్లో వంద శాతం పనులు పూర్తవగా, మిగతా చోట్ల 90 శాతం పూర్తయ్యాయి. కాంపౌండ్, టాయిలెట్స్, కిచెన్ షెడ్స్ పనులు గజ్వాడలో మినహా ఇతర చోట్ల 50 శాతం పనులు పూర్తి కాలేదు. మర్పల్లి, గజ్వాడ స్కూల్స్ మినహా మిగతా ఏ స్కూల్‌లోనూ తాగునీటి పనులు పూర్తవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది
చిన్న శంకరంపేట మండలంలో 18 స్కూల్స్ సెలెక్ట్ కాగా శాలిపేట ప్రైమరీ స్కూల్ లో స్థలం కారణంగా డైనింగ్ హాల్ పనులు నిలిచిపోయాయి.
కౌడిపల్లి మండలంలో 21 స్కూళ్లు ఎంపిక కాగా రూ.3.54 కోట్లు మంజూరయ్యాయి. రాయిలాపూర్ లో పనులు పూర్తికాగా, పేయింట్ ఆగిపోయింది. మండల కేంద్రమైన కౌడిపల్లి బాయ్స్ హై స్కూల్‌లో కిచెన్ షెడ్ వృథాగా ఉంది. గర్ల్స్ హైస్కూల్లో డైనింగ్ హాల్ పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయింది.
రామాయంపేట మండలంలో మొత్తం 18 స్కూల్స్ఎంపికవగా.. ఎక్కడా పనులు పూర్తి కాలేదు. రామాయంపేట పట్టణంలో శిథిలమైన గర్ల్స్ హైస్కూల్ బిల్డింగ్‌ను కూల్చి కొత్త బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పినా పనులు మొదలు కాలేదు. రామాయంపేట గర్ట్స్ ప్రైమరీ స్కూల్లో టాయిలెట్స్ అసంపూర్తిగా ఉన్నాయి.
టేక్మాల్ మండలం ఎల్లంపల్లి, మెరుగొనికుంట తండా, బొడ్మట్పల్లి ప్రైమరీ స్కూల్లలో పనులు పూర్తికాగా, కొరంపల్లి, అచ్చన్న పల్లి, ఎలకుర్తి, హాసన్ మహమ్మద్ పల్లి స్కూల్లలో పనులు జరుగుతున్నాయి. మిగితా స్కూల్లలో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
తూప్రాన్ మండలంలో 13 స్కూళ్లను మన ఊరు మనబడి కింద ఎంపిక చేశారు. అందులో భాగంగా 11 స్కూల్ లకు టెండర్లు కంప్లీట్ చేశారు. తూప్రాన్ గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ లో ఇంకా టెండర్లు జరగలేదు. టెండర్లు పూర్తయిన యవాపూర్, పోతరాజ్‌పల్లి, రావెల్లి స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. మిగతా స్కూల్లో కరెంట్ ఫిట్టింగ్, కొన్ని స్కూళ్లలో డైనింగ్ హాల్, పెయింటింగ్, కిచెన్, కాంపౌండ్ వాల్, టాయిలెట్ పనులు చివరిదశలో ఉన్నాయి.