మందమర్రి గనుల్లో 78 శాతం బొగ్గు ఉత్పత్తి

మందమర్రి గనుల్లో  78 శాతం బొగ్గు ఉత్పత్తి
  • ఆర్కేపీ ఓసీపీ, కేకే-5 గనుల్లో వంద శాతం ఉత్పత్తి

కోల్ బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా బొగ్గు గనులు 2024–-25 ఆర్థిక సంవత్సరం 78 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయని ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​ తెలిపారు. సోమవారం జీఎం ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. మార్చి నెలఖారునాటికి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి 2,54,000 టన్నులకు గాను 2,56,952 టన్నులతో 101 శాతం ఉత్పత్తి సాధించిందన్నారు. ఏరియా గనుల్లో ఆర్థిక సంవత్సరం 34.60 లక్షల టన్నులకు 27.09 లక్షల టన్నులతో 78 శాతం బొగ్గును ఉత్పత్తి చేసిందన్నారు. ఆర్కేపీ ఓపెన్​కాస్ట్​గనిలో 7లక్షల టన్నులకు గాను 9,18,907 టన్నుల ఉత్పత్తితో 131శాతం, కేకే-5 అండర్​ గ్రౌండ్​ మైన్​లో 2లక్షల టన్నులకు 2.05 లక్షల టన్నుల ఉత్పత్తి చేసి 103 శాతం సాధించిందని తెలిపారు. 

2025–26 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 27.80లక్షల టన్నులుగా నిర్ణయించినట్లు జీఎం తెలిపారు. 365 ఎకరాల అటవీ భూముల పర్మిషన్ల కోసం కార్పొరేట్ యాజమాన్యం చర్యలు చేపట్టిందన్నారు. కార్మికవాడల్లో నీటి ఎద్దడి లేకుండా కొత్తగా చతులాపూర్​ వద్ద మూడు బోర్లను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఏరియా ఎస్వోటుజీఎం విజయప్రసాద్, ఇంజనీర్ ​వెంకటరమణ, డీజీఎం (ఐఈడీ) రాజన్న, పర్సనల్​ మేనేజర్​శ్యాంసుందర్, ఎస్​ఈ (సివిల్) రాము, డీవైపీఎం మైత్రేయబంధు తదితరులు పాల్గొన్నారు.