నాలుగోసారి వరద కాల్వకు గండి

  • నీట మునిగిన కరీంనగర్ జిల్లాలోని మన్నెంపల్లి 
  • భారీగా నీరు వస్తుండగా ఇండ్లలో తడిసిన సామగ్రి  
  • ఎమ్మెల్యే కవ్వంపల్లి, ఇరిగేషన్ అధికారుల పరిశీలన

తిమ్మాపూర్​, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి మీదుగా వెళ్లే ఎస్ఆర్ఎస్ పీ డీ-–-4  వరద కాల్వకు గండిపడింది. దీంతో ఊరిలోకి భారీగా వరద నీరు చేరుతుండగా.. పలువురి ఇండ్లల్లోని నిత్యవసరాలు పూర్తిగా తడిసిపోయాయి. నదిలా వరద ప్రవహిస్తుండగా.. పంట పొలాలన్నీ నీట మునిగాయి. తోటపల్లి రిజర్వాయర్ నుంచి చిగురుమామిడి మండలం పీచుపల్లి మీదుగా వరద కాల్వ మన్నెంపల్లిలోకి వస్తుంది. సాగు కోసం అధికారులు నీటిని వదిలారు. ఒకేసారి భారీగా నీరు విడుదల చేయడంతో కాల్వకు గండిపడింది. 

గతంలోనూ ఇదే కాల్వకు మూడుసార్లు పడగా.. ప్రస్తుతం నాలుగోసారి గండి పడింది. ప్రతిసారి అధికారులు రావడం తూతూమంత్రంగా మరమ్మతులు చేస్తూ వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామంలో పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలోనూ మూడుసార్లు గండి పడింది.. ప్రస్తుతం కాల్వకు శాశ్వత మరమ్మతులు చేస్తామని చెప్పారు. వరదతో నష్టపోయిన కుటుంబానికి నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గండిపడిన ప్రదేశాన్ని ఎస్సారెస్పీ ఈఎన్​సీ శంకర్​పరిశీలించి, తాత్కాలిక మరమ్మతులు చేయాలంటూ అధికారులను ఆదేశించారు.