చేర్యాలకు వరద ముప్పు .. కుడి చెరువు ఆక్రమణలతో కొత్త సమస్య

చేర్యాలకు వరద ముప్పు .. కుడి చెరువు ఆక్రమణలతో కొత్త సమస్య
  • ఎఫ్టీఏల్లోనే యథేచ్ఛగా నిర్మాణాలు
  • నాలాలు మూసివేయడంతో కాలనీల్లోకి చేరుతున్న వరద నీరు
  • ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు 

సిద్దిపేట/చేర్యాల, వెలుగు: చేర్యాల పట్టణంలోని  కుడి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల లో నిర్మించిన అక్రమ నిర్మాణాల వల్ల పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. అలాగే నేషనల్​హైవే 365 బీ పనుల్లో భాగంగా కొన్ని చోట్ల  నాలాలను మూసి వేయడం వల్ల పట్టణంలోకి వరద నీరు చేరుతోంది. రెండు రోజుల కింద కురిసిన వర్షాల వల్ల వరద నీరు పట్టణంలోని పోచమ్మ టెంపుల్ ఏరియా, ఆది ఆంజనేయ కాలనీ, కడవెర్గు రోడ్డు, కొత్త బస్టాండ్ ఏరియా, మెయిన్ రోడ్డులోని కాలనీల్లోకి చేరింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

చెరువు స్థలం ఆక్రమణ

కుడి చెరువు విస్తీర్ణం 66 ఎకరాలు కాగా కొన్నేళ్ల నుంచి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణతో సగానికి పైగా కబ్జాకు గురైంది. ఆయా స్థలాల్లో ఇండ్లు , ఫంక్షన్ హాళ్లు నిర్మించడంతో కుడి చెరువులోకి రావాల్సిన వరద నీరు పట్టణంలోని వివిధ కాలనీల్లోకి చేరుతోంది.  గతంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝలిపించినా కొందరు కోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్నారు.  తర్వాత వీటిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ఎవరూ ముందుకు రాలేదు. దీనికి తోడు చేర్యాల జీపీ నుంచి మున్సిపాల్టీగా మారే సమయంలో కొందరు అక్రమంగా జీపీ అనుమతులు పొంది ఇండ్ల నిర్మాణాలు చేసుకున్నారు. దీంతో కుడి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు కుచించుకుపోయాయి. మరికొందరు చెరువు స్థలంలోనే వెంచర్లు వేసినా ఎవరూ పట్టించుకోలేదు. 

Also Read :- గణపురంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్​

నాలాలు మూసివేసిన అక్రమార్కులు

కుడి చెరువు చెరువు స్థలాన్ని ఆక్రమించి అక్రమార్కులు నాలాలను మూసి వేశారు.కొత్త బస్టాండ్ ఏరియా నుంచి ఐదు నాలాల ద్వారా  వరద నీరు కుడి చెరువులోకి చేరేది. దీని వల్ల తమ ఇండ్లకు నష్టం వాటిల్లుతుందని ఐదు నాలాలను మట్టితో నింపి వర్షం నీరు రాకుండా చేశారు. నాలాలు మూసుకుపోవడంతో వరద నీరు నిలిచి పోవడమే కాకుండా పలు సందర్భాల్లో కాలనీల్లోకి ప్రవేశించి కొత్త కష్టాలను తీసుకొస్తుంది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పెద్ద ఎత్తున వరద నీరు పట్టణంలోకి ప్రవేశించడానికి నాలాల మూసివేత ఒక కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

ఫిర్యాదులపై స్పందించని అధికారులు

కుడి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణల ఫిర్యాదులపై అధికారులు సరైన విధంగా స్పందించలేదు. దశాబ్దంన్నర కింద హుస్నాబాద్ కు చెందిన ఒక రియల్టర్ కుడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే వెంచర్ ఏర్పాటు చేస్తే అప్పటి ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అఖిలపక్షాల నాయకుల ఫిర్యాదులపై కూడా స్పందించలేదు. చేర్యాల జీపీ నుంచి మున్సిపాల్టీగా మారే క్రమంలో ఆక్రమణకు గురైన స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వల్ల  చెరువు క్రమంగా కుచించుకుపోయింది. 

క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు

కుడి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణపై  క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటాం. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నీరు చెరువులోకి వెళ్లక కాలనీల్లో కి ప్రవేశించింది. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. 

నాగేందర్, మున్సిపల్ కమిషనర్, చేర్యాల