ఇన్‌‌‌‌ఫార్మర్ల పేరుతో ఇద్దరి హత్య

ఇన్‌‌‌‌ఫార్మర్ల పేరుతో ఇద్దరి హత్య
  • చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని బీజాపూర్‌‌‌‌ జిల్లాల్లో దారుణం

భద్రాచలం, వెలుగు : ఇన్‌‌‌‌ఫార్మర్ల పేరుతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు హత్య చేశారు. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌ జిల్లా బార్సూర్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ పరిధిలోని తుష్మా గ్రామానికి చెందిన టీచర్‌‌‌‌ బామన్‌‌‌‌ కశ్యప్, గ్రామస్తుడు అనీశ్‌‌‌‌ రామ్‌‌‌‌ హత్యకు గురయ్యారు. మావోయిస్ట్‌‌‌‌ పార్టీ తూర్పు బస్తర్‌‌‌‌ కమిటీకి చెందిన సాయుధ మావోయిస్టులు బుధవారం రాత్రి గ్రామంలోకి వచ్చి ఇద్దరినీ సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ విచారించిన అనంతరం ఇద్దరి గొంతు కోసి హత్య చేశారు. అనంతరం వారి మృతదేహాలను గ్రామంలో వదిలి వెళ్లారు. 

వీరిద్దరు పోలీస్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, ఎన్ని సార్లు హెచ్చరించినా వినకపోవడం వల్లే హత్య చేసినట్లు మావోయిస్టులు ఓ లెటర్‌‌‌‌ వదిలేశారు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు విషయం చెప్పడంతో గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బార్సూర్‌‌‌‌ పోలీసులు తెలిపారు.