మావోయిస్టుల దాడిలో 10 మంది పోలీసులు, ఓ డ్రైవర్​ మృతి

  • చత్తీస్​గఢ్​లోని దంతెవాడ జిల్లాలో ఘటన
  • పేలుడు ధాటికి రోడ్డుపై 10 ఫీట్ల మేర ఏర్పడిన గుంత
  • ఎగిరిపడిన మినీ వ్యాన్
  • విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
  • సీఎం బాఘెల్​కు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఫోన్

దంతెవాడ/భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లో మావోయిస్టులు మరోమారు విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలో తమ ఉనికి చాటుకునేందుకు పోలీసుల వాహనాన్ని శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారు. దంతెవాడ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం పోలీసులే టార్గెట్​గా మాటేసి దాడి చేశారు. ఈ దాడిలో 10 మంది డీఆర్​జీ పోలీసులు, ప్రైవేటు వ్యాన్ డ్రైవర్ ఒకరు దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి పోలీసుల మినీ వ్యాన్​ తునాతునకలుగా మారింది. రోడ్డు రెండుగా చీలిపోయింది. రోడ్డుపై ఏకంగా పదడుగుల గుంత ఏర్పడింది.  విషయం తెలిసిన వెంటనే బస్తర్​ ఐజీ సుందర్​రాజ్​, దంతెవాడ ఎస్పీ సిద్దార్థ్​ తివారీ ఆరన్​ పూర్​ అడవుల్లోకి అదనపు బలగాలను తరలించారు. ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, చత్తీస్​ గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బాఘెల్​ సహా వివిద రాష్ట్రాల సీఎంలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు స్పందించారు. మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. మావోయిస్టుల దాడిలో పోలీసులు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అని ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బాఘెల్​ కు ఫోన్ చేశారు. దాడి వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ఆపరేషన్​లో పాల్గొని తిరిగొస్తుండగా..

జిల్లాకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్ జీ) పోలీసులు బుధవారం యాంటీ మావోయిస్టు ఆపరేషన్ ఒకటి చేపట్టారు. మావోయిస్టు కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పది మంది పోలీసుల బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. దర్భా డివిజన్ ఏరియాలో కూంబింగ్​ నిర్వహించారు. అయితే, అయితే మావోయిస్టులు వీరి రాకను పసిగట్టి అక్కడి నుంచి తప్పించుకున్నారు. కూంబింగ్​ అనంతరం తిరిగి అదే మార్గంలో వస్తారనే అంచనాతో మావోయిస్టులు మాటు వేశారు. మావోయిస్టుల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన పోలీసులు మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. అద్దెకు తీసుకొచ్చిన ప్రైవేట్​ వ్యానులో వారు క్యాంప్ కు బయలుదేరారు. ఈ క్రమంలో ఆరన్ పూర్ గ్రామం దాటిన మినీ వ్యాన్ పై మావోయిస్టులు దాడి చేశారు. ఆరన్​ పూర్, సమేలీ గ్రామాల మధ్య నడి రోడ్డుపై అమర్చిన ఇంప్రొవైజ్​డ్​ఎక్స్​ప్లోజివ్ ​డివైజ్(ఐఈడీ)ను పేల్చేశారు. దీంతో పోలీసులు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ గాల్లోకి ఎగిరిపడి ముక్కలైంది. ఈ దాడిలో పదిమంది పోలీసులతో పాటు వ్యాన్ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

పక్కా ప్లాన్​ తోనే జరిగిందా?

రాష్ట్రంలో రెండేళ్లుగా మావోయిస్టులు భారీ దాడుల జోలికి పోలేదు. ఏటా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్నారు. మరోవైపు, డీఆర్​జీ సిబ్బంది దాడుల నేపథ్యంలో చాలామంది జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. కొంతమంది ఎన్ కౌంటర్లలో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతాదళాలపై భారీ దాడి చేస్తామని వారం రోజుల కిందట మావోయిస్టులు బెదిరింపు లేఖ ఒకటి విడుదల చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇంటెలిజెన్స్ వర్గాలకు తప్పుడు సమాచారం చేరేలా చేసి, ఆరన్​పూర్, సమేలీ గ్రామాల మధ్య ఐఈడీ తో దాడి చేసినట్లు అధికారులు అననుమానిస్తున్నారు. దాడి కోసం పెద్ద ఎత్తున ఐఈడీ ఉపయోగించారని, దాదాపు 50 కిలోల పేలుడు పదార్థాన్ని అమర్చారని అధికారులు తెలిపారు.

డిస్ట్రిక్ట్ రిజర్వ్​ గార్డ్స్(డీఆర్​జీ) అంటే..

నక్సలిజంపై పోరులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దళమే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్​జీ). చత్తీస్ గఢ్​ పోలీస్​ శాఖలో డీఆర్​జీ ఒక భాగం. ఇందులో ఆదివాసీ యువతే ఎక్కువ. యువకులను ఎంపిక చేసి, మావోయిస్టులపై పోరాటానికి ప్రత్యేకంగా శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను ప్రత్యేక దళంగా ఏర్పాటు చేసి మావోయిస్టుల ఏరివేతకు సంబంధించిన ఆపరేషన్లకు పంపిస్తారు.

చనిపోయిన పోలీసులు వీళ్లే..

డీఆర్జీ హెడ్​ కానిస్టేబుళ్లు జోగా సోడె, మున్నారాం కడితి, సంతోష్​ తామోలతో పాటు కానిస్టేబుళ్లు దుల్గే మండావి, లక్మూ మర్కాం, జోగా కొవ్వాసి, హరిరాం మండావి, రాజూరాం కర్టం, జయరాం పొడియం, జగదీశ్​​ కొవ్వాసి, మినీ వ్యాన్ డ్రైవర్​ ధనీరాం యాదవ్​

మావోయిస్టుల కోసం గాలింపు..

ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు పోలీసుల మృతదేహాలను అంబులెన్స్ లో దంతెవాడకు తరలించారు. మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. దాడి ఘటనపై డీజీపీ అశోక్​ జునేజా, నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ వివేకానంద సిన్హా ఇతర ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. సీనియర్​ పోలీసు ఆఫీసర్లతో స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి కూంబింగ్​ పర్యవేక్షణ చేపట్టారు.

గతంలో చత్తీస్​గఢ్​లో జరిగిన మేజర్ దాడులు

    2021 ఏప్రిల్: సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని టెర్రామ్​ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్.. భద్రతా బలగాలకు చెందిన 22 మంది మృతి
    2018 మార్చి: సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో సీఆర్ పీఎఫ్​కు చెందిన తొమ్మిది మంది సిబ్బంది దుర్మరణం
    2018 ఫిబ్రవరి: సుక్మా జిల్లా భేజ్జిలో ఎదురుకాల్పులు.. ఇద్దరు పోలీసులు మృతి
    2017 ఏప్రిల్: సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్​ లో 24 మంది సీఆర్​పీఎఫ్​ సిబ్బంది మృత్యువాత
    2017 మార్చి: సుక్మా జిల్లాలోనే జరిగిన మరో దాడిలో 12 మంది సీఆర్ పీఎఫ్​ సిబ్బంది మృతి
    2014 మార్చి: సుక్మా జిల్లాలో మావోయిస్టులు దాడి చేయడంతో భద్రతా బలగాలకు చెందిన 15 మంది దుర్మరణం
    2014 ఫిబ్రవరి: దంతెవాడ జిల్లాలో ఆరుగురు పోలీసులను కాల్చి చంపిన మావోయిస్టులు
    2013 మే: దర్భా వ్యాలీలో మావోయిస్టులు దాడి చేసి మాజీ మంత్రి మహేంద్ర కర్మతో సహా 25 మంది కాంగ్రెస్ పార్టీ నేతలను చంపేశారు
    201‌‌‌‌‌‌‌‌0 జూన్: నారాయణపూర్​ జిల్లాలో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో 26 మంది సీఆర్​పీఎఫ్​ సిబ్బంది మృత్యువాత పడ్డారు
    2010 మే: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఎనిమిది మంది సీఆర్ పీఎఫ్​సిబ్బంది మృతి
    2010 ఏప్రిల్: దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మెరుపుదాడి చేసి 75 మంది సీఆర్ పీఎఫ్​ సిబ్బందిని చంపేశారు
    2009 సెప్టెంబర్: బీజాపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నలుగురు పౌరులను మావోయిస్టులు కాల్చి చంపారు
    2009 జూలై: దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్​ మైన పేలి ఆరుగురి మృతి. ఈ ఘటనకు వారం రోజుల ముందు బస్తర్ జిల్లాలో ఓ గ్రామస్తుడిని మావోయిస్టులు చంపేశారు